హైదరాబాద్, ఆగష్టు 1(జే ఎస్ డి ఎం న్యూస్) :
పసికందు గుండె శాస్త్ర చికిత్స కోసం బ్లడ్ డోనర్ లైఫ్ సేవర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం అందించి ఉదారతను చాటుకుంది.హైదరాబాద్‌కు చెందిన బేబీ ఆఫ్ మాధవి జూలై 25 న లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్‌లో జన్మించింది. పుట్టిన వెంటనే గుండె సంబంధిత సమస్యలు తలెత్తాయి.జూలై 26న బిడ్డను తండ్రి కిమ్స్ హాస్పిటల్‌కి తరలించారు. వైద్యుల సూచనల ప్రకారం బాబుకు ఎడమ వైపు గుండె రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల మంచి, చెడు రక్తం ఒకే నాళం ద్వారా ప్రవహిస్తోందనీ వైద్యులు గుర్తించారు. అత్యవసర పరిస్థితి లో వెంటనే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు తెలిపారు. సర్జరీకి రూ 5 నుంచి 6 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. డ్రైవర్ గా పనిచేస్తున్న చిన్నారి తండ్రి చింత కింది శ్రీనివాస్ కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది. వారి వద్ద ఉన్న బంగారం అమ్మి 2 లక్షలు సమకూర్చుకున్నారు. అయినా, మిగిలిన సర్జరీ ఖర్చుల కోసం వారు ఆర్థికంగా ఇబ్బంది పడుతుండగా, బ్లడ్ డోనర్ లైఫ్ సేవర్ ఫౌండేషన్ అధ్యక్షుడు సునీల్ ధూట ను సంప్రదించారు.ఫౌండేషన్ తరఫున 2 రోజులు విరాళాలు సేకరించి, శుక్రవారం కిమ్స్ ఆసుపత్రిలో బాబు తండ్రికి రూ 85,300 లు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సునీల్ ధూట మాట్లాడుతూ తమ ఫౌండేషన్ సభ్యుల మద్దతుతో ఈ చిన్నారి కుటుంబానికి రూ 85,300లు ఆర్థిక సహాయం చేయగలిగామన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి తమ ఫౌండేషన్ మరియు ఫౌండేషన్ సభ్యులు ఎప్పుడు ముందుటారనీ ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా చిన్నారి కుటుంబం తమకు విరాళాలు అందించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ,కృతఙ్ఞతలు తెలియ జేశారు.
బిడ్డ తల్లి జూలై 25న డెలివరీ అయి, నిన్నే లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. గత ఐదు రోజులుగా తల్లి, బిడ్డ వేర్వేరు ఆసుపత్రుల్లో ఉండాల్సి వచ్చింది. ఫౌండేషన్ ద్వారా అందిన సహాయం ఈ కుటుంబానికి కొంత ఊరట కలిగించింది.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు సుకిందర్, ఉమాదేవి, శ్రీనివాస్ గారు కూడా పాల్గొన్నారు.
