ఆరు దశాబ్దాల అనంతరం నాగంబొట్ల పాలెంలో ఈనెల 3 నుండి నిర్వహిస్తున్న
పోలేరమ్మ కొలుపులు ముగిసాయి. గ్రామస్తులు మంగళవారం తమకు చెందిన బంధు, మిత్రులను తమ నివాసాలకు పిలిచి విందు భోజనాలు ఏర్పాటు చేయటంతో గ్రామంలో కోలా హాలం నెలకొన్నది. అధిక సంఖ్యలో బంధు మిత్రులు తరలి రావటంతో గ్రామంలో వాహనాలతో క్రిక్కిరిసి పోయినది. కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావటంతో ప్రధాన మార్గాలతో పాటు గ్రామానికి నలు వైపుల ఉన్న వేర్వేరు మార్గాల ద్వారా బంధు మిత్రులు రాక పోకలు సాగించారు. ఎన్ ఐ మల్లిఖార్జున రావు తన సిబ్బందితో ట్రాఫిక్ నియంత్రణ చేసినప్పటికి పూర్తి స్థాయిలో నియంత్రణ కాలేదు. గ్రామం మొదటిలో ఆర్టీసీ బస్సు నిలిచి పోవటంతో ఒక వైపు పూర్తిగా రోడ్ బ్లాక్ కావటం తీవ్ర ఇబ్బందికరంగా మారినది. గ్రామంలో ఆయా పార్టీల అభిమానులు తమకు చెందిన అభిమాన నాయకులకు పిలిచి విందు భోజనం ఏర్పాటు చేసారు. వైసీపి జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, టిడిపి దర్శి నియోజక వర్గ ఇన్చార్జి, డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు లు వారి అభిమాన కార్యకర్తలు, నాయకుల నివాసాలకు వెళ్లి శుభాకాంక్షలు తెలిపి వారి ఇచ్చిన విందును స్వీకరించారు. మండలంలోని ప్రజా ప్రతినిధులు, ఆయా పార్టీల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
