ఒంగోలు విజయనగర కాలనీకి చెందిన అన్నంపల్లి గురవయ్య కుటుంబ సభ్యులతో కలిసి ఒంగోలు అన్నవరపాడులోని ఓ వివాహానికి హాజరయ్యారు. అనంతరం ఆటోలో ప్రయాణించి ఆర్టీసీ బస్టాండ్ వద్ద బస్సు ఎక్కించేందుకు వచ్చారు. బంధువులను బస్సులో ఎక్కించిన అనంతరం తిరిగి వస్తుండగా, గురవయ్య తన ఐదు సంవత్సరాల కుమారుడు అన్నంపల్లి తేజస్ చెయ్యి పట్టుకొని తీసుకువస్తున్నారు. అదే సమయంలో బాలుడు చెయ్యి వదిలి, తల్లిదండ్రులు చూసేలోపు బస్సుల మధ్యలో నుంచి వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు ఒకవైపు, బాలుడు మరోవైపు వెళ్లడంతో పిల్లవాడు కనిపించకుండా పోయాడు. ఈ సమాచారాన్ని డయల్ 112 తెలియజేశారు.
డయల్ 112 పోలీస్ కంట్రోల్ రూమ్ సిబ్బంది వెంటనే స్పందించి తక్షణమే ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్కు మరియు ట్రాఫిక్ పోలీసులకు తెలియజేశారు. వెంటనే స్పందించిన తాలూకా సీఐ విజయ్ కృష్ణ, ట్రాఫిక్ ఎస్ఐ మాలాద్రి, ఏఎస్ఐ హనుమంతరావు మరియు పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి సీసీ కెమెరాలను పరిశీలించగా బాలుడు బస్సుల మధ్యలో నుండి వెళ్లినట్టు గుర్తించారు. ట్రాఫిక్ ద్విచక్ర వాహనాల పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం ద్వారా సమాచారానికి తెలియజేస్తూ చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకటం ప్రారంభించి, లక్కీ షాపింగ్ మాల్ ఎదురు ఉన్న సోనీ షాప్ వద్ద బాలుడిని గుర్తించారు. కేవలం ఒక గంటలోనే బాలుడిని గుర్తించి, తల్లిదండ్రుల చెంతకు సురక్షితంగా అప్పగించారు. తమ బాబును క్షేమంగా తమ వద్దకు చేర్చిన పోలీసు అధికారులకు బాలుడి తల్లిదండ్రులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
తప్పిపోయిన బాలుడిని త్వరగా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించిన తాలూకా సీఐ విజయ్ కృష్ణ, ట్రాఫిక్ ఆర్ ఎస్ఐ మాలాద్రి, ఏఎస్ఐ హనుమంతరావు, కానిస్టేబుల్ జాబీర్లను జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు.
