పోలీస్ స్టేషన్ స్థితిగతులు, సిబ్బంది పని తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించడానికి మద్దిపాడు పోలీస్ స్టేషన్ ను ఆదివారం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆకస్మికంగా సందర్శించి, తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో భాగంగా స్టేషన్ పరిసరాలు, వివిధ గదులు, విధుల్లో ఉన్న సిబ్బంది పనితీరు, డ్యూటీల కేటాయింపు, రిసెప్షన్ కౌంటర్ నిర్వహణ, ఫిర్యాదుల స్వీకరణ విధానం, మహిళా సహాయక కేంద్రం, రికార్డ్స్, సీడీ ఫైల్స్ మరియు తదితర అంశాలను సమీక్షించారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో లా అండ్ ఆర్డర్, నేర నివారణ వ్యూహాలపై తీసుకుంటున్న చర్యలపై అధికారులను ఆరా తీసి పలు సూచనలు చేసారు. 174 సిఆర్పిసి, మిస్సింగ్ కేసులు మరియు పాత పెండింగ్ కేసులలో విచారణ త్వరగతిన పూర్తి చేయాలని, కేసుల విచారణకు చేపట్టవలసిన విధానం గురించి దిశానిర్దేశం చేశారు. గ్రేవ్ కేసులలో త్వరగా దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసి, తగిన సాక్షాదారాలతో ముద్దాయిలకు శిక్ష పడే విధంగా చేయాలన్నారు. కేసుల పరిష్కారంలో జాప్యం వహించే కొలది బాధితులకు సత్వర న్యాయం అందించలేమని కనుక దానికి అనుగుణంగా పోలీస్ స్టేషన్ యొక్క నిర్వహణ ఉండాలని సూచనలు చేశారు.
నేరాలు కట్టడికి గస్తి ముమ్మురం చేయాలని, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిరంతర గస్తీ నిర్వహించేటట్లు, నైట్ బీట్ డ్యూటీ చేస్తున్న సిబ్బందిని తరచూ అప్రమత్తంగా చెయ్యాలని, డయల్-112 ఫిర్యాదులు రాగానే వెంటనే స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య ను పరిష్కరిoచేటట్లు చూడాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు మరింత ముందస్తు చర్యలు తీసుకోవాలని, విరివిగా విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలని, స్టేషన్ లో వివిధ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, విధుల పట్ల అంకితభావంగా ఉంటూ ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలన్నారు.
ప్రజలకు సిసి కెమెరాల పట్ల అవగాహన కల్పించి వాటి ప్రాముఖ్యతను వివరిస్తూ ఇంకా కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. గుడ్ టచ్ & బ్యాడ్ టచ్ పై విస్తృతంగా స్కూల్/కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పించాలని, గంజాయి వంటి మాదక ద్రవ్యాలు సేవించడం వల్ల కలిగే దుష్ప్రభావాలు, చట్టపరమైన చర్యల గురించి, సైబర్ నేరాలపై ప్రజలు మరియు విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. పోలీసు స్టేషన్ కు ఫిర్యాదు చేయుటకు వచ్చే ఫిర్యాదులుదారులు పట్ల, మర్యాదపూర్వకంగా మాట్లాడి వారి యొక్క సమస్య తెలుసుకొని వెంటనే విచారణ చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఎస్పీ సూచించారు.
జిల్లా ఎస్పీ వెంట ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఒంగోలు రూరల్ సీఐ యన్. శ్రీకాంత్ బాబు, మద్దిపాడు ఎస్సై బి. శివరామయ్య మరియు సిబ్బంది ఉన్నారు.


