మాతృ, శిశు మరణాలను నివారించడానికి ప్రతీఒక్కరూ ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, వైద్యాధికారులను ఆదేశించారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఎండిఆర్ సమావేశంలో, ఏప్రిల్, మే, జూన్ మాసాలలో జిల్లాలో సంభవించిన మాతృ, శిశు మరణాలపై జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సమీక్షించారు. ఈ మూడు నెలల కాలంలో ఒక బాలింత మృతి చెందినట్లు అధికారులు వివరించగా, ఆ బాలింత మృతికి కారణాలపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. ప్రభుత్వ వైద్యాధికారుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఆయా ఆసుపత్రుల్లో ఉన్న వసతులు, వైద్యుల గురించి ప్రశ్నించారు. బాలింత మృతిపై వైద్యారోగ్య శాఖ అధికారులు పూర్తీ స్థాయిలో విచారణ చేసి సమగ్ర నివేదికను అందజేయాలని జిల్లా కలెక్టర్, వైద్యాధికారులను ఆదేశించారు. మాతృ మరణాలను నివారించడానికి, స్త్రీ గర్భం దాల్చిన దగ్గరనుంచి, ప్రసవం వరకూ అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకొనేలా చూడాలని, ప్రతీనెలా క్రమం తప్పకుండా పరీక్షలను నిర్వహించి, అవసరమైన మందులు, పోషక పదార్ధాలు, తగిన సలహాలు సూచలను అందించాలని జిల్లా కలెక్టర్, వైద్యాదికారులను ఆదేశించారు. మరణం తరువాత చేసేది ఏమీ ఉండదని, సాధ్యమైనంత వరకు చిత్తశుధ్దితో కృషి చేసి, ఆధునిక వైద్య సదుపాయాలు, తమ అనుభవం, వైద్య పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రాణాలను కాపాడాలని అన్నారు. తమ వల్ల కాదనిపిస్తే, వెంటనే నిర్ణయం తీసుకొని వీలైనంత త్వరగా పై ఆసుపత్రులకు పంపించాలని సూచించారు. అనంతరం జిల్లాలో 2024-25, 2025-26 లో జూలై వరకు జరిగిన గర్భాశయ శస్త్రచికిత్సలపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు.
ఈ సమావేశంలో డిఎంఅండ్‌హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర రావు, జిజిహెచ్ సుపరింటెండెంట్ డా. మాణిక్యాల రావు, గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ సంధ్యా రాణి, , డిఐఓ డా కమలశ్రీ, ఐసిడిఎస్ పిడి సువర్ణ, , పలువురు వైద్యాధికారులు, ప్రయివేటు ఆసుపత్రుల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
