అన్ని శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగుల సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేశాను – కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా – బదిలీపై వెళ్లిన కలెక్టర్ కు జిల్లా అధికార యంత్రాంగం ఘన వీడ్కోలు
ప్రకాశం జిల్లాలో కలెక్టరుగా పనిచేసి గుంటూరు జిల్లా కలెక్టరుగా బదిలీపై వెళుతున్న ఏ.తమీమ్ అన్సారియాకు జిల్లా అధికార యంత్రాంగం ఘన వీడ్కోలు పలికారు. ఆదివారం ఒంగోలు రిమ్స్ ఆడిటోరియంలో ఆమెకు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఆమెతో కలిసి పనిచేసిన అనుభవాలను, తమకు దిశానిర్దేశం చేసిన సంగతులను ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు వెల్లడించారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ... అన్ని శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగుల సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేశానని అన్నారు. గత ఏడాది జూన్ 27న ప్రకాశం జిల్లా కలెక్టరుగా బాధ్యతలు చేపట్టిన తాను, విస్తృతంగా క్షేత్రస్థాయి పర్యటనలు చేయడం ద్వారా జిల్లాలోని పరిస్థితిపై స్పష్టమైన అవగాహన వచ్చిందన్నారు. ఈ క్రమంలోనే బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రకాశం జిల్లాలో స్వచ్ఛంద సంస్థలతోపాటు వివిధ వర్గాలను భాగస్వాములను చేయటం ద్వారా బాల్యవివాహాలు, వెట్టి చాకిరీని నిర్మూలించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నీటి సంరక్షణ చర్యలలో భాగంగా డ్వామా ఆధ్వర్యంలో చేపట్టిన పనులకు ప్రకాశం జిల్లాకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం కంటే కూడా ఉద్యోగులకు ఆయా విషయాలలో అవసరమైన అవగాహన కలిగించి దిశా నిర్దేశం చేయటం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించాలనేది తన ఆలోచన విధానమని ఆమె చెప్పారు. జిల్లాలో 14 నెలలకు పైగా కలెక్టరుగా పనిచేసిన కాలంలో ఇదే విధానాన్ని తాను అనుసరించానని తెలిపారు. జిల్లాలో ముఖ్యమంత్రి చేపట్టిన అధికారిక, అనధికారిక పర్యటనలు విజయవంతం కావడంలోనూ, విజయవాడ వరదల సమయంలో జిల్లా నుంచి అవసరమైన ఆహార పదార్థాలను పంపించడంలోనూ ప్రభుత్వ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల మహిళల పాత్రను ఈ సందర్భంగా ఆమె కొనియాడారు. అనంతరం వివిధ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది, ఉద్యోగ సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అన్సారియాను ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ, డిఆర్ఓ బి.చిన ఓబులేసు, ఒంగోలు ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న, కనిగిరి ఆర్డీవో కేశవర్ధన్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు ప్రసంగించారు.