మెగా డీఎస్సీలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా విజయవాడ తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు
తెలిపారు. ఈనెల 19వ తేదీన నిర్వహించే నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాల నుంచి వెళ్తున్న ఎంపికైన అభ్యర్థుల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ బుధవారం సాయంత్రం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకాశం భవనం నుంచి కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జి. సత్యనారాయణ, డీఈవో ఏ.కిరణ్ కుమార్ ఇందులో పాల్గొన్నారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి ఎంపికైన 661 మంది అభ్యర్థులను, జోనల్ స్థాయిలో ఎంపికైన ప్రిన్సిపాల్స్, పీజీటీలు, టీజీటీలు 188 మందిని విజయవాడ తరలించేందుకు తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ ఈ సందర్భంగా సి.ఎస్. కు వివరించారు. ఒంగోలు నగరంలోని సెయింట్ జేవియర్ హై స్కూల్, ఆగ్జిలియం హై స్కూల్, మంగమూరు డొంకలో ఉన్న రామచంద్ర మిషన్, వెంగముక్కలపాలెంలో ఉన్న క్విస్ ఇంజనీరింగ్ కాలేజీలకు అభ్యర్థులను ఈనెల 18వ తేదీ సాయంత్రం 4 గంటలలోగా తరలించి 19వ తేదీ ఉదయం 9 గంటల వరకు వసతి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వీరికి అవసరమైన భోజనము, అల్పాహారం సమకూర్చి 19వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 38 బస్సులలో విజయవాడ తరలిస్తామన్నారు. అభ్యర్థులకు వసతి కల్పిస్తున్న సమయంలో తాగునీరు, ఆహారము, పారిశుద్ధ్యము, విద్యుత్ సరఫరా విషయంలో ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఈ శిబిరాలలో ప్రత్యేక మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేసేలా వైద్య అధికారులను ఆదేశించానని, భద్రత పరంగా అవసరమైన బందోబస్తు కూడా కల్పిస్తామని చెప్పారు. అభ్యర్థితో పాటు విజయవాడ వచ్చే ఒక సహాయకునికి కూడా ఈ కేంద్రాల్లో ఆశ్రయం కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి బస్సులోనూ విద్యాశాఖ సిబ్బందితోపాటు ఒక పోలీసు కూడా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
కాగా, గర్భిణులు, బాలింతలను విజయవాడకు తరలింపు నుంచి మినహాయింపు ఇవ్వాలని సి.ఎస్. స్పష్టం చేశారు.

