మొంథా తుఫాన్ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం వలన ఈనెల 27, 28, 29 తేదీల్లో తీరప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, తీవ్రమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఆదివారం అన్నీ జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాయుగుండం 28వ తేదీ ఉదయం నాటికి తీవ్రమైన తుఫానుగా మారుతుందని, ఈ సమయంలో ఎక్కడా ఎటువంటి ప్రాణ-ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మచిలీపట్నం నుంచి కాకినాడ ప్రాంతం వరకు తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిస్తుందని, ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేలా సమాచార వ్యవస్థలు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఎస్ఎంఎస్ అలర్ట్స్, సోషల్ మీడియా, ఐవీఆర్ఎస్ కాల్స్, వాట్సాప్‌ల ద్వారా ప్రజలకు ముందస్తుగా హెచ్చరికలు పంపించాలన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తుఫాన్ ప్రభావంపై సమాచారం వేగంగా చేరవేసి, నష్ట నివారణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే తీర జిల్లాలలో మోహరించామని వెల్లడించిన ముఖ్యమంత్రి… తుఫాన్‌పై ప్రెడిక్టివ్ మోడల్, రియల్ టైమ్ డేటా ఆధారంగా విశ్లేషణ చేస్తున్నామన్నారు. రిజర్వాయర్లు, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నీటిమట్టాలను నిరంతరం పర్యవేక్షించి అందుకు అనుగుణంగా కార్యాచరణ అమలు చేయాలని స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 27,000 సెల్ టవర్లను డీజిల్ జనరేటర్లతో సిద్ధం చేశామని ముఖ్యమంత్రి అన్నారు. విద్యుత్, టెలికాం, తాగునీటి సరఫరా వ్యవస్థకు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. సముద్ర తీర ప్రాంత ప్రజలను తక్షణమే సమీపంలోని తుఫాన్ రక్షణ కేంద్రాలకు తరలించి పునరావాసం కల్పించాలని సూచించారు. తుఫాన్ తీవ్రతను బట్టి విద్యా సంస్థలకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవులు ప్రకటించాలన్నారు. రహదారులు, చెరువులు, కాలువ గట్లు కోతకు గురైతే తక్షణం మరమ్మతులు చేసేలా సిద్ధంగా ఉండాలన్నారు. చెట్లు కూలిపోయినా, కొమ్మలు విరిగిపడినా వాటిని తొలగించడానికి అవసరమైన పవర్ సా, క్రేన్‌లు, జేసీబీలు ప్రతీ సబ్ డివిజన్ స్థాయిలో సిద్ధం చేయాలని, డ్రోన్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టేలా ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. జాతీయ రహదారులపై అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వాహనాలు సిద్ధం చేశామని, రాష్ట్రవ్యాప్తంగా 851 జేసీబీలు, అలాగే క్రేన్‌లు – పవర్ సాలు 757 అందుబాటులో ఉంచామని వెల్లడించారు. మరోవైపు పంటనష్టం వివరాలను స్పష్టంగా తెలుసుకునేలా వ్యవసాయ శాఖ-ఆర్టీజీ వ్యవస్థ సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈసారి మొంథా తుఫాన్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు వివిధ జిల్లాలకు ఇప్పటికే ప్రత్యేక అధికారులను నియమించామని… ప్రతీ శాఖ, ప్రతీ విభాగం సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ప్రజల ఆస్తి, ప్రాణ, మౌలిక సదుపాయాల రక్షణకు ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.
ఈ టెలి కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, డిజాస్టర్ మేనేజ్మెంట్ పిడి మాధురి, వ్యవసాయ శాఖ జేడి శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.
