అమాయక ప్రజలను, యువతను లక్ష్యంగా చేసుకుని ఎక్కువగా డబ్బు సంపాదించవచ్చని ప్రలోభపెడుతూ క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఈరోజు నుంచి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో, జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ నిఘాఉంచినట్లు తెలిపారు.యువత, విద్యార్థులు బెట్టింగ్ జోలికి వెళ్లకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
క్రికెట్ బెట్టింగ్ చట్టవిరుద్ధమని, ఇది ఆర్థికంగా మరియు సామాజికంగా జీవితాలను నాశనం చేస్తుందని, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అవి మోసపూరితంగా ఉండే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ గారు హెచ్చరించారు. క్రికెట్ బెట్టింగ్ వల్ల కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని పేర్కొన్నారు.
వినోదం కోసం మాత్రమే క్రికెట్ మ్యాచ్‌లు చూడాలని, బెట్టింగ్ వైపు మొగ్గు చూపకూడదని సూచించారు. బెట్టింగ్ యాప్‌లలో బాల్-టు-బాల్ పందేలు వేసే అవకాశం ఉండటంతో, ఆకర్షణీయమైన ప్రకటనలను నమ్మి అత్యాశకు పోకుండా యువత జాగ్రత్తగా ఉండాలని, శ్రమించకుండా వచ్చే డబ్బు వెనుక అనేక నష్టాలు దాగి ఉంటాయని గుర్తుంచుకోవాలని సూచించారు.
పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక నిఘా ఉంచాలని, యువత చదువుపై దృష్టి పెట్టాలని, తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చేలా ఉన్నతంగా జీవించాలని సూచించారు. బెట్టింగ్ కేసుల్లో ఇరుక్కొని జీవితాలను నాశనం చేసుకోకూడదని హెచ్చరించారు.
అమాయకులను ఆసరాగా చేసుకుని ఎవరైనా డబ్బు ఆశ చూపించి క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడినా, నిర్వహించినా, ప్రోత్సహించినా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. బెట్టింగ్ వెబ్‌సైట్లు, యాప్‌లపై నిఘా ఏర్పాటు చేసి, ఏపీ జూద చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
జిల్లాలో ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలిసినా వెంటనే స్థానిక పోలీసులకు, డయల్ 112 కు లేదా పోలీస్ వాట్సాప్ నెంబర్ 9121102266కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
