డబుల్ బెడ్ రూమ్ హౌసింగ్ కాలనీలో ఉచిత మెగా వైద్య శిబిరం.ప్రారంభించిన టి జి ఎస్ పి ఎఫ్ డిజిపి స్వాతిలక్రా.

హైదరాబాద్ ఏప్రిల్ 19 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
సికింద్రాబాద్ నెక్లెస్ రోడ్ అంబేద్కర్ నగర్ డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ కాలనీలో ఆదివారం టి జి ఎస్ పి ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(టీజీఎస్‌పీఎఫ్) డైరెక్టర్ జనరల్ స్వాతి లక్రా ప్రారంభించారు. ఈ శిబిరంలో కాలనీవాసులకు అత్యాధునిక వైద్య పరీక్షలు మందులు ఉచితంగా అందించారు.
ఈ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించిన స్వాతి లక్రా నిరుపేదలకు వైద్యం పట్ల అవగాహన కల్పిస్తూ వారికి అవసరమైన మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహించాలని సూచించారు. ఎంత సంపాదించినా ఆరోగ్యం సహకరించకపోతే ఆ సంపద వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆమె గుర్తుచేశారు.
ఈ మెగా వైద్య శిబిరంలో జనరల్ ఫిజీషియన్లతో పాటు గుండె జబ్బులు, గైనకాలజీ, పీడియాట్రిక్స్ (పిల్లల వైద్యం), ఆర్థోపెడిక్ విభాగాలకు చెందిన నిపుణులు పాల్గొని రోగులకు వైద్య సలహాలు అందించారు. వీరికి తోడుగా కంటి పరీక్షలు, డెంటల్ చెకప్ కూడా నిర్వహించి అవసరమైన ఐ డ్రాప్స్, పేస్టులు , మందులను ఉచితంగా అందజేశారు. ముఖ్యంగా కాలనీవాసుల కోసం బీపీ, షుగర్ పరీక్షలతో పాటు ఈసీజీ, 2డీ ఈకో, బోన్ మినరల్ డెన్సిటీ (ఎముకల సాంద్రత), పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ వంటి ఖరీదైన పరీక్షలను కూడా ఉచితంగా చేయడం విశేషం. టీజీఎస్‌పీఎఫ్ సామాజిక బాధ్యతగా చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కమాండెంట్ ఎన్. త్రినాథ్, అసిస్టెంట్ కమాండెంట్ సన్యాసిరావు, ఎస్సైలు, ఏఎస్సైలు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అలాగే కాలనీ ప్రెసిడెంట్ గణేష్, మాజీ కార్పొరేటర్ కిషోర్, కిరణ్మయి, సతీష్, కిరణ్ కుమార్ యాదవ్ తదితర ముఖ్య నేతలు హాజరై ఈ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *