రాంగోపాల్ పేట్, ఏప్రిల్ 28,
(జే ఎస్ డి ఎం న్యూస్)
బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో, మత సామరస్యంతో జరుపుకోవాలని సైఫాబాద్ ఏసీపీ సంజయ్ పిలుపునిచ్చారు. మంగళవారం లేక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఎస్ మక్తా కమ్యూనిటీ హాల్లో ముస్లిం మత పెద్దలు, మసీదు కమిటీ సభ్యులు మరియు కసాయిల ప్రతినిధులతో ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ
సందర్భంగా ఏసీపీ సంజయ్ మాట్లాడుతూ.పండుగ వేళ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా బక్రీద్ సందర్భంగా జంతువుల వధ మరియు వ్యర్థాల తొలగింపు విషయంలో ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు స్వచ్ఛందంగా పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.ఈ సమావేశంలో లేక్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ వెంకటేశ్వర్లు, సైఫాబాద్ ఎస్హెచ్ఓ సీతయ్యతో పాటు లేక్ డీఐ శ్రీనివాసరావు, ఎస్సైలు బాలరాజ్, ప్రసన్న మరియు సైఫాబాద్ ఎస్సై నవీన్ తదితరులు పాల్గొన్నారు. పండుగ రోజుల్లో ట్రాఫిక్ నియంత్రణ మరియు భద్రతా పరంగా పోలీసులు తీసుకుంటున్న చర్యలను వారు వివరించారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.

