డబ్బాలతో వచ్చే వారికి, పెద్ద మొత్తంలో అడిగేవారికి ఆయిల్ పోయవద్దని పెట్రోల్ బంకుల నిర్వాహకులకు జిల్లా కలెక్టర్ . పి.రాజాబాబు స్పష్టం చేశారు. సోమవారం ఆయన టంగుటూరు మండలంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న పలు ఆయిల్ బంకులను తనిఖీ చేశారు. స్టాకు రిజిస్టర్ లను పరిశీలించి, వాహనదారులకు ఆయిల్ పోస్తున్న తీరుపై ఆరా తీశారు. ముందుగా బిపిసిఎల్ డిపోను సందర్శించారు. తమ వద్ద ఉన్న నిల్వలు, డిమాండ్ వివరాలను మేనేజర్ ఎల్. విజయ్ కుమార్ ఈ సందర్భంగా కలెక్టరుకు వివరించారు. జిల్లాలో తమకు 74 రిటైల్ అవుట్లెట్లు ఉన్నాయని, ఎక్కడా కొరతలేదని, ఇండెంట్ రాగానే సరఫరా చేస్తున్నామని చెప్పారు. అవసరానికి తగినంతగా తమ వద్ద నిలువలు ఉన్నట్లు ఆయన తెలిపారు. అనంతరం శివపురం, సూరారెడ్డిపాలెంలోని హెచ్పిసిఎల్ బంకులు, ఐఓసీఎల్ అవుట్ లెట్ ను కూడా కలెక్టర్ పరిశీలించారు. స్థానికంగా తమకు డిపోలు లేకపోవడంతో విజయవాడ నుంచి ఆయిల్ వస్తోందని వారు తెలిపారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఎప్పటికప్పుడు ఇండెంట్ పంపించి, జాప్యం లేకుండా ఆయిల్ ను బంకులలో అందుబాటులో ఉంచేలా చూడాలని నిర్వాహకులకు చెప్పారు. బల్క్ గా ఆయిల్ పోయవద్దని, డబ్బాలలో కూడా వద్దని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాలను పర్యవేక్షించేందుకు రెవెన్యూ, పోలీసు సిబ్బందిని బంకులలో ఉంచామని, తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెంట ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న, తహసిల్దార్ ఆంజనేయులు, సిబ్బంది ఉన్నారు.


