రాజకీయాలలో నేను ఎవరిని లెక్క చేయను అని మాజీ రాష్ట్ర మంత్రి, ఆరు జిల్లాల జనసేన పార్టీ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. కార్యకర్తల కోసం ఎంత దూరమైనా పోతానని హామీ ఇచ్చారు.ఒంగోలులోని బాలాజీ తిరుపతి రావు కళ్యాణమండపంలో ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాల స్థానిక సంస్థల డిలిమినేషన్ సమావేశం సోమవారం నిర్వహించారు. కార్యక్రమంలో తిరుపతి శాసన సభ్యులు ఆరిణి శ్రీనివాసులు, టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్,అనంతపురం అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ వరుణ్ తో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తాను జనసేన పార్టీలో చేరిన తరువాత ఒంగోలు నందు మొట్టమొదటి సమావేశం నిర్వహించడం జరిగిందని అన్నారు.తాను వైసీపీలో ఉన్నప్పుడు పవన్ కల్యాణ్ తన పట్ల చూపిన అభిమానం మరువలేనిదని అన్నారు. తాను ఒంగోలులో ఏడుసార్లు ఎన్నికలలో పాల్గొనగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేశానని గుర్తు చేశారు. ఒంగోలులో టిడిపికి తనను ఓడించే శక్తి లేదన్నారు. ఓడిపోయిన రెండుసార్లు కేవలం పవన్ కళ్యాణ్ వల్లే ఓడిపోయానని పేర్కొన్నారు.ఒంగోలులో కాపు సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం ఎక్కువుగా ఉందని తెలిపారు. రెడ్డి సామాజిక వర్గం ఓటింగ్ చాలా తక్కువ అన్నారు. పవన్ కళ్యాణ్ కోసమే తాను జనసేన పార్టీలో చేరినట్టు పేర్కొన్నారు. అయితే తాను జనసేన పార్టీ నాయకుల పై వంద కేసులు తప్పుడు ప్రచారం చేస్తున్నరని ఆవేదన వ్యక్తం చేశారు. తాను జనసేన పార్టీలో చేరటం చాలా మందికి ఇష్టం లేదన్నారు. తాను యాడ్ పై కేసులు పెట్టాను నిరూపించాలని సవాల్ విసిరారు. ఏంజెల్ లా కూటమి ప్రభుత్వ పాలనలో జనసేన పార్టీ కార్యకర్తలకు పూర్తిగా అన్యాయం జరిగిందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన పార్టీ బలంగా ఉన్న ప్రతి చోట పోటీచేసి కార్యకర్తలకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.జిల్లాలో జనసేన బలం ఎక్కువుగా ఉన్న చోట జనసేన తరుపున పోటీ చేందుకు కృషి చేస్తామని తెలియజేశారు.గడిచిన రెండు ఏళ్ల కాలంలో పార్టీ నాయకులకు అన్యాయం జరిగిందని అన్నారు. పార్టీలో రెండు వర్గాలు ఉండకూడదని హితవు పలికారు. అందరూ సమన్వయంగా పని చేసి పవన్ కళ్యాణ్ ను ఉన్నత స్థాయిలో నిలిపేందుకు అందరూ పని చేయాలని పిలుపు నిచ్చారు.తిరుపతి శాసన సభ్యులు ఆరిణి శ్రీనివాసులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆదేశాలతో స్థానిక సంస్థలలో డి లిమిటేషన్ ప్రక్రియలో భాగంగా ఉమ్మడి ప్రకాశం,నెల్లూరు,రాయలసీమ జిల్లాలో పర్యటించి కార్యకర్తల మనోభావాలను తెలుసుకోవడం జరుగుతుందని అన్నారు. కార్యకర్తలకు న్యాయం చేసేందుకు ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.సమావేశంలో మాల కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్, సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ చీకటి వంశీధీప్,నియోజకవర్గాల సమన్వయకర్తలు కందుకూరి బాబు,ఆమంచి స్వాములు, ఇమ్మిడి కాశీనాథ్,బెల్లంకొండ సాయిబాబు, మల్లిఖార్జున్, వరకూటి నాగరాజు,కనపర్తి మనోజ్, ఆలా అనిల్,దేవకీ వెంకటేశ్వర్లు,అధికార ప్రతినిధి రాయపాటి అరుణ,మాలగా రమేష్ ,నాగిశెట్టి బ్రహ్మయ్య తోపాటు ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి విచ్చేసిన జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
సమావేశంలో చిన్నపాటి రభస
సభ కార్యక్రమం ప్రారంభంలో అద్దంకి, యర్రగొండపాలెం జనసేన కార్యకర్తల మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది.యర్రగొండ పాలేనికి చెందిన జనసేన ఇంచార్జీ వైసీపీకి పని చేస్తున్నారు అంటూ ఆందోళన చేపట్టగా స్పందించిన బాలినేని త్రీ మెన్ కమిటీ ఏర్పాటు చేసి న్యాయం చేస్తామని వారికి హామీ ఇవ్వడంతో కార్యకర్తలు ఆందోళన విరమించారు.
కనిపించని రియాజ్ వర్గం
జనసేన పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు, ఓడా చైర్మన్ షేక్ రియాజ్ వర్గం సమావేశంలో కనిపించలేదు. ముందు నుండి జనసేన పార్టీలోకి బాలినేని చేరటం ఆ వర్గానికి ఇష్టం లేదు. వైసీపీలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న బాలినేని జనసేన పార్టీ కార్యకర్తలపై అనేక తప్పుడు కేసులు పెట్టించారని ఆ వర్గం బాలినేనిపై గుర్రు గా ఉంది. ఒంగోలులో జనసేన పార్టీ నిర్వహించే కార్యక్రమాలు ఎవరికి వారే యమున తీరే అన్న తీరుగా వ్యవహరిస్తుంటారు. రెండు వర్గాలు కలిపి ఒక్క కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసిన దాఖలాలు లేవు. ఈ సమావేశంలో జనసేన పార్టీలోని వర్గ విభేదాలు స్పష్టంగా బహిర్గతమయ్యాయి.

