20 లక్షల సూర్యఘర్ కనెక్షన్లు ప్రజలకు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. అద్దంకి నియోజకవర్గంలో ఆదివారం మంత్రి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కొటికలపూడి పంచాయతీ పరిధిలోని పార్వతీపురం, తిమ్మారెడ్డిపాలెం నుంచి కొటికలపూడి వరకు రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్డును మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ప్రారంభించారు. ఈ రహదారి ద్వారా గ్రామాల మధ్య రాకపోకలు సులభతరం కావడంతో పాటు రైతులు, విద్యార్థులు, స్థానిక ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా కొటికలపూడి పంచాయతీ పరిధిలో రూ.30 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లను కూడా మంత్రి ప్రారంభించారు. గ్రామాల్లో మౌలిక వసతుల మెరుగుదలతో ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని తెలిపారు. అనంతరం శ్రీరామ్ నగర్ కాలనీలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ పథకాన్ని మంత్రి ప్రారంభించారు. ఇప్పటికే ముందుకొచ్చి దరఖాస్తు చేసుకున్న 6 లక్షల మందికి ఉచితంగా సోలార్ కనెక్షన్లు అందిస్తున్నామని వెల్లడించారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా బీసీ వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.20 వేల రాయితీ అందిస్తోందని ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 20 లక్షల సూర్యఘర్ కనెక్షన్లు ప్రజలకు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. విద్యుత్ శాఖలో సూర్యఘర్ పథకంతో పాటు ఆర్డీఎస్ఎస్ పనులను కూడా త్వరలోనే పూర్తి చేసే దిశగా చర్యలు వేగవంతం చేశామని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, గ్రామీణాభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. అనంతరం కొటికలపూడి గ్రామ పంచాయతీ పరిధిలో దేవాలయ ప్రహారీని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ప్రారంభించారు. ఈ ప్రహారీ నిర్మాణానికి ఏపీ ట్రాన్స్ కో సీఎస్ఆర్ నిధుల నుంచి రూ. 15 లక్షల కేటాయించినట్లు పేర్కొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

మహానాడు నిర్వహణపై మంత్రి గొట్టిపాటి సమీక్ష

తెలుగుదేశం పార్టీ నిర్వహించనున్న మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పని చేయాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పిలుపునిచ్చారు. అద్దంకి నియోజకవర్గ నేతలతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మంత్రి మహానాడు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ ఏడాది మహానాడును వర్చువల్ విధానంలో నిర్వహించేందుకు గల కారణాలను పార్టీ క్యాడర్‌కు వివరించారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ అధ్యక్షులు, కీలక నేతల ప్రసంగాలు వర్చువల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం అవుతాయని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలు, అభిమానులు వర్చువల్ గా పాల్గొనేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. నేతల ప్రసంగాలను అందరూ వీక్షించేలా ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. మహానాడు ద్వారా పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ విజయాలు, భవిష్యత్ కార్యాచరణను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నామని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *