హైదరాబాద్ జూన్ 30,(జే ఎస్ డి ఎం న్యూస్) :
నగరంలో వరుస దోపిడీలు, ఆస్తి నేరాలకు పాల్పడుతూ, ప్రజలను హడలెత్తిస్తున్న అంతర్రాష్ట్ర మోస్ట్ వాంటెడ్ నేరస్థుడు, ‘బ్రూస్ లీ’ గ్యాంగ్ ఆటకట్టించారు చిలకలగూడ పోలీసులు. వ్యవస్థీకృత నేర ముఠాలపై నగర పోలీసు యంత్రాంగం ఉక్కుపాదం మోపుతున్న క్రమంలో ఒక పక్కా స్కెచ్‌తో భోయిగూడ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా ముఠా సూత్రధారితో సహా ముగ్గురు పాత నేరస్థులను అరెస్ట్ చేయగా, ఒక మైనర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుండి దొంగిలించిన రెడ్‌మి మొబైల్ ఫోన్, ఒక యాక్టివా స్కూటర్‌తో పాటు మీర్‌పేట్ దొంగతనానికి సంబంధించిన రూ. 2.25 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం, ముషీరాబాద్ జవహర్‌నగర్‌కు చెందిన కార్మికుడు సి. రాజ్ కుమార్ ఈ నెల 22న సాయంత్రం భోయిగూడలోని ఫ్లోరా హోటల్ వద్ద భోజనం కొనుగోలు చేస్తుండగా, హోండా యాక్టివాపై వచ్చిన నలుగురు దుండగులు అతడిని అడ్డుకున్నారు. బాధితుడిని బలవంతంగా పద్మారావునగర్ వైపు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి, అతని వద్దనున్న రెడ్‌మి మొబైల్ ఫోన్, రూ. 6,000 నగదును లాక్కున్నారు. అనంతరం ఆలగడ్డబావి రైల్వే అండర్ బ్రిడ్జ్ సమీపంలో వదిలిపెట్టి, చిలకలగూడ క్రాస్ రోడ్స్ వద్ద బాధితుడిని మరోసారి బెదిరించి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చిలకలగూడ క్రైమ్ టీమ్, సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి ఆదేశాల మేరకు రంగంలోకి దిగింది. సాంకేతిక విశ్లేషణ, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి బేడీలు వేశారు.
ఈ ముఠాకు ప్రధాన సూత్రధారి కర్ణాటక హుబ్బళ్ళికి చెందిన దార్ల నెహెమ్యా అలియాస్ బ్రూస్ లీగా గుర్తించారు. ఇతనిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో హత్య, హత్యాయత్నం, ఇళ్ల దొంగతనాలు సహా ఏకంగా 65 క్రిమినల్ కేసులు ఉన్నాయి. గతంలో పీడీ యాక్ట్ కింద జైలుకు వెళ్లిన ఇతడు, చంచల్‌గూడ జైల్లో ఉన్నప్పుడే తోటి ఖైదీలకు సులభంగా డబ్బుసంపాదించవచ్చునని ఆశ చూపి ముఠాగా మార్చాడు. ఈ ఏడాది జూన్‌లో జైలు నుండి
విడుదలైన వెంటనే దారా అశ్వంత్, నితిన్ ఫ్రాన్సిస్ మరియు ఒక మైనర్ తో కలిసి గ్యాంగ్ ఏర్పాటు చేసి భోయిగూడలో ఈ దోపిడీకి పాల్పడ్డాడు. భోయిగూడ దోపిడీ కంటే ముందే అనంతపురంలో ఒక వాచ్‌మన్‌ను కొట్టి నగదు దోచుకున్న బ్రూస్ లీ, ఆ తర్వాత కూడా ఏమాత్రం గ్యాప్ లేకుండా 23వ తేదీతెల్లవారుజామున అల్వాల్‌లో ఇల్లు పగలగొట్టే ప్రయత్నం చేశాడు. అదే రోజు రాత్రి మీర్‌పేట్ పరిధిలో ఒక ఇంట్లోకి చొరబడి భారీగా బంగారు ఆభరణాలు, నగదు దొంగిలించాడు.
అరెస్ట్ అయిన వారిలో ప్రధాన సూత్రధారి బ్రూస్ లీతో పాటు, అతనికి సహకరించిన దారా అశ్వంత్, రసూల్‌పురాకు చెందిన పాత నేరస్థుడు నితిన్ ఫ్రాన్సిస్ అలియాస్ బబ్లూ ఉన్నారు. నిందితులను సికింద్రాబాద్ కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. జువైనల్ నిందితుడిని జెజె బోర్డు ముందు హాజరుపరిచారు. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, నిందితులను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన చిలకలగూడ ఎస్హెచ్ఓ వి. రామకృష్ణ, డిటెక్టివ్ ఇన్స్‌పెక్టర్ ఎల్. మధుబాబు బృందాన్ని సికింద్రాబాద్ జోన్ అడిషనల్ డీసీపీ జె. నరసయ్య, ఏసీపీ కె. శశాంక్ రెడ్డి, డీసీపీ రక్షిత కృష్ణమూర్తి అభినందించారు. విజయవంతమైన ఆపరేషన్ అనంతరం సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి పాత నేరస్థులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. నగరంలో దోపిడీలు, వ్యవస్థీకృత ఆస్తి నేరాల పట్ల పోలీసులు ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అవలంబిస్తున్నారని స్పష్టం చేశారు. జైలు నుండివిడుదలయ్యాక కూడా బుద్ధి
మార్చుకోకుండా ముఠాలు కట్టే నేరగాళ్లపై నిరంతర నిఘా ఉంటుందని, అవసరమైతే రౌడీ షీట్లు తెరవడమే కాకుండా పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు. ప్రజల ఆస్తిపాస్తుల రక్షణే ధ్యేయంగా సిటీ పోలీస్ పనిచేస్తుందని, ప్రజలు కూడా ఎలాంటి అనుమానాస్పద కదలికలు గమనించినా వెంటనే ‘100’ కి సమాచారం అందించాలని ఆమె పిలుపునిచ్చారు.
