హైదరాబాద్ జూన్ 30, (జే ఎస్ డి ఎం న్యూస్)
నగరంలోని ఓపి ఛాట్రినాక నుండి కందికల్ గేట్ ఫ్లైఓవర్ ప్రారంభ ప్రాంతం వరకు సుమారు 225 మీటర్ల పొడవునా సిసి (CC) రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నట్లు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డి. జోయల్ డేవిస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిర్మాణ పనుల కారణంగా జూలై 1వ తేదీ నుండి పనులు పూర్తయ్యేంత వరకు ఈ మార్గంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఛాట్రినాక నుండి చంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ (ఓల్డ్ గుట్ట ఎక్స్ రోడ్) కు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో వాహనదారులు ఈ మార్పులను గమనించాలని సూచించారు.
ట్రాఫిక్ మళ్లింపుల వివరాల ప్రకారం.. నల్లవాగుశ్మశానవాటిక నుండి కందికల్ గేట్ ఫ్లైఓవర్ వైపు వెళ్లే అన్ని వాహనాలను నల్లవాగుశ్మశానవాటిక ‘యు’ టర్న్ వద్ద ఓల్డ్ గుట్ట వైపు మళ్లిస్తారు. అలాగే లాల్ దర్వాజా నుండి ఓపి ఛాట్రినాక వైపు వెళ్లే
వాహనదారులు, ప్రయాణికులను బాబా బార్ లేన్ వద్ద ఇంజిన్ బౌలి వైపు
మళ్లించనున్నారు. మరోవైపు గౌలిపురా నుండి ఓపి ఛాట్రినాక వైపు వెళ్లే
వాహనాలను ఓపి ఛాట్రినాక వద్ద లాల్ దర్వాజా వైపునకు మళ్లిస్తారు. ఉప్పుగూడ నుండి ఓపి ఛాట్రినాక వైపు వెళ్లే వాహనాలకు నేరుగా అనుమతి లేదని, సదరు వాహనాలను పంచముఖి హనుమాన్ దేవాలయం వద్ద గౌలిపురా వైపు మళ్లించనున్నట్లు జాయింట్ సీపీ స్పష్టం చేశారు.
నగర పౌరులు, వాహనదారులు ఈ ట్రాఫిక్ మళ్లింపులను గమనించి, తమ గమ్యస్థానాలకు సకాలంలో చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని లేదా ఆయా మార్గాలలో ప్రయాణాలను నివారించాలని పోలీసులు కోరారు. ట్రాఫిక్ సమాచారానికి సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అధికారిక ఫేస్బుక్ పేజీ (facebook.com/HYDTP), ట్విట్టర్/ఎక్స్ హ్యాండిల్ (@HYDP) లను అనుసరించవచ్చని సూచించారు. ప్రయాణంలో ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా సహాయం కొరకు ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నెంబర్ 9010203626 ను సంప్రదించాలని కోరారు.
