సెయింట్ ఆండ్రూస్ స్కూల్‌లో ‘అరైవ్ అలైవ్’..రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన.

బోయిన్‌పల్లి, జూలై 15 (జే ఎస్ డి ఎం న్యూస్) :
రహదారి భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని, నిర్లక్ష్యపు డ్రైవింగ్ ప్రాణాంతకంగా మారుతుందని తిరుమలగిరి డివిజన్ ట్రాఫిక్ ఏసీపీ జి. శంకర్ రాజు అన్నారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ శ్రీమతి బి. సుమతి ఆదేశాల మేరకు, ట్రాఫిక్-I డీసీపీ శ్రీ కె. రాహుల్ రెడ్డి పర్యవేక్షణలో బుధవారం ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా బేగంపేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయిన్‌పల్లి సెయింట్ ఆండ్రూస్ హై స్కూల్‌లో ప్రత్యేక ట్రాఫిక్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ శంకర్ రాజు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
రోడ్లపై మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, మైనర్లు వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్ మరియు వాహనం నడుపుతూ సెల్‌ఫోన్ మాట్లాడటం వల్ల జరిగే ఘోర ప్రమాదాలు, వాటి దుష్పరిణామాలను ఆయన విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. లేన్ క్రమశిక్షణ పాటిస్తూ, ట్రాఫిక్ సిగ్నళ్లను గౌరవించడం ద్వారా క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని స్పష్టం చేశారు. ముఖ్యంగా మైనర్లకు చట్టబద్ధమైన వయస్సు, లైసెన్స్ వచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వకూడదని, ఒకవేళ నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు అత్యంత ఉత్సాహంగా పాల్గొని రోడ్డు భద్రతపై తమకున్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ఈ వినూత్న అవగాహన సదస్సుకు విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి విశేష స్పందన లభించింది. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ అంజనా జోసెఫ్, వైస్ ప్రిన్సిపాల్ వసుధ, ఈవెంట్స్ కో-ఆర్డినేటర్ ఎస్తేర్, జనరల్ మేనేజర్ ఎం. శ్రీకాంత్, సీఎస్‌ఓ అయూబ్ ఖాన్, ట్రాన్స్‌పోర్ట్ మేనేజర్ సెల్వరాజ్‌తో పాటు పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *