బేగంపేట జులై 18, (జే ఎస్ డి ఎం న్యూస్) :
సనత్‌నగర్ నియోజకవర్గం లోని ప్రసిద్ధ శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవాలయంలో ఆషాఢ మాసం సందర్భంగా జూలై 19 నుంచి ఆగస్టు 3 వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్న బోనాల మహోత్సవాలకు పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమను ఆలయ అధికారులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి మనోహర్ రెడ్డి, ప్రధాన అర్చకులు శర్మ, ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆమె స్వగృహానికి వెళ్లి బోనాల ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేసి ఉత్సవాలకు విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.
ఆహ్వాన పత్రికను అందుకున్న అనంతరం డాక్టర్ కోట నీలిమ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు తప్పకుండా హాజరవుతానని తెలిపారు. ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొనే ఈ మహోత్సవాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడతాయని పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం నిధులను మంజూరుచేయడంతో పాటు, పండుగ ఏర్పాట్లనుసమర్థవంతంగాపర్యవేక్షించేందుకు ఆలయ ట్రస్ట్ బోర్డును కూడా నియమించిందని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, ఈ ఏడాది బోనాల ఉత్సవాలు గతంలో కంటే మరింత వైభవంగా, విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు శృతి కామేశ్వర్, రాజేంద్ర, కిరణ్, దేవి వరప్రసాద్, సోనాలి, శ్రీకాంత్, రమేష్, గీత, మల్లికార్జున్, భాస్కర్, సంజయ్ ప్రకాష్, హేమంత్ సింగ్, రాకేష్ అగర్వాల్, శివకుమార్ లాల్ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
