పొలాల్లో విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్లలోని రాగి తీగలను దొంగిలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. ఈ రాగిని కొనుగోలు చేసే వారిపైనా కేసులు పెట్టాలని అన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇటీవల ఈ తరహా దొంగతనాలు ఎక్కువైన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యులపై ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, ఇరు జిల్లాల విద్యుత్ అధికారులు, పోలీసు ఆఫీసర్లు, సంబంధిత అధికారులతో శనివారం ప్రకాశం భవనంలో ఆయన సమావేశం నిర్వహించారు. రెండు జిల్లాలలోని పరిస్థితిని ఏపీ సిపిడిసిఎల్ ఎస్.ఈ.లు కట్టా వెంకటేశ్వర్లు ( ప్రకాశం), అబ్దుల్ కరీం ( మార్కాపురం) ఈ సందర్భంగా వివరించారు. రాగి తీగలు దొంగతనానికి గురికావడం వలన ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు, పంట కోల్పోవడం వంటి రూపాలలో రైతులు నష్టపోతున్నట్లు వారు చెప్పారు.
దీనిపై కలెక్టర్ స్పందిస్తూ రాగి తీగలను దొంగిలించే వారితో పాటు, వాటిని కొనుగోలు చేసే వారిని కూడా ఈ నేరంలో భాగస్వాములను చేయాలని చెప్పారు. రాగి వ్యాపారము, ఇతర స్క్రాప్ వ్యాపారం చేసేవారు ప్రత్యేకంగా రాగి విక్రయము, కొనుగోలుకు సంబంధించిన లావాదేవీలను తెలిపేలా రిజిస్టర్లు నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ దిశగా చర్యలు తీసుకునేలా వాణిజ్య పన్నుల అధికారులతో విస్తృత సోదాలు చేయిస్తానన్నారు. పొలాల్లో ఇలాంటి దొంగతనాలను అరికట్టేందుకు విద్యుత్ అంతరాయం వస్తే తక్షణమే ట్రాన్స్ఫార్మర్ ను పరిశీలించేలా స్థానిక పంచాయతీ కార్యదర్శి, విద్యుత్తు లైన్ మన్, నలుగురు రైతులు, ఒక కానిస్టేబుల్ తో ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఎవరైనా ట్రాన్స్ఫార్మర్ చుట్టుపక్కల సంచరిస్తే ఈ కమిటీ సభ్యుల మొబైల్ ఫోన్లకు మెసేజ్ రావడంతో పాటు ట్రాన్స్ఫార్మర్ వద్ద సోలార్ లైటు, సిసి కెమెరా ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించాలని విద్యుత్ శాఖ అధికారులకు కలెక్టర్ చెప్పారు. దొంగతనాలు జరిగేందుకు ఎక్కువ అవకాశం ఉన్న ట్రాన్స్ఫార్మర్లను కూడా గుర్తించాలన్నారు.
ఎస్పీ మాట్లాడుతూ రాగి తీగల దొంగతనం కేసులలో నిందితులకు కౌన్సెలింగ్ ఇస్తామని, దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అవసరమైతే పీడీ కేసులు కూడా పెట్టే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. స్క్రాప్ వ్యాపారులకు కూడా తాగి తీగల కొనుగోలు విషయాలలో అవగాహన కల్పిస్తామని, ఆధారాలు లేకుండా వీరి వద్ద రాగి లభ్యమైతే కేసులు పెడతామని చెప్పారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ పివి రమణ, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, జడ్పీ సీఈవో చిరంజీవి, డిపిఓ అనుపమ, డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
