పచ్చదనాన్ని పెంపొందించడంలో సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలని, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన చెప్పారు. సముద్ర తీరంలోని ప్రభుత్వ స్థలాలు, పట్టణాలలోని ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు నాటేందుకు తీసుకోవలసిన చర్యలపై శనివారం ప్రకాశం భవనంలో ఆయన అధ్యక్షతన జిల్లాస్థాయి
సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.
అటవీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం చేసే ఆర్థిక సహాయం, నిబంధనలను డి.ఎఫ్.వో. వినోద్ కుమార్ ( టెరిటోరియల్ ) ఈ సమావేశంలో వివరించారు. సముద్రతీర ప్రాంతంలో గ్రేట్ గ్రీన్ వాల్ నిర్మించేందుకు ప్రభుత్వ స్థలాలను గుర్తిస్తే వచ్చే ఐదేళ్లలో మొక్కలు నాటేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. అదేవిధంగా ‘ నమో వన యోజన ‘ పథకం కింద మున్సిపాలిటీలలో నగరవనాలు పెంచేందుకు, పాఠశాలల్లో మొక్కలు నాటేందుకు తీసుకోవలసిన చర్యలను తెలిపారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ రాష్ట్రంలో హరిత విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసే ఆర్థిక సహకారాన్ని వినియోగించుకుని రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని వినోద్ కుమార్ ను ఆదేశించారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ పివి రమణ, డీ.ఎఫ్.వో. రాజశేఖర్ ( సోషల్ ఫారెస్ట్రీ ), ఒంగోలు ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి గోపీచంద్, డీ.ఈ.వో. రేణుక, డ్వామా పి.డి. జోసఫ్ కుమార్, జెడ్పీ సీ.ఈ.వో. చిరంజీవి, డీ.పీ.వో. అనుమప, పంచాయతీరాజ్ ఎస్.ఈ. అశోక్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, గనులశాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్, ఇరిగేషన్ ఎస్.ఈ. వరలక్ష్మి, తీర ప్రాంత మండలాల తహసీల్దార్లు, ఒంగోలు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.


