బేగంపేట, జూలై 29, (జే ఎస్ డి ఎం న్యూస్)
బోనాల ఉత్సవాలు మన సంస్కృతి ని చాటి చెప్పే పండుగ అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం రాంగోపాల్ పేట డివిజన్ మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించే కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజల అనంతరం బోనం ఊరేగింపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికే పరిమితమైన బోనాల పండుగను విశ్వవ్యాప్తంగా నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆషాడ మాసం ప్రారంభమైతే హైదరాబాద్ జంట నగరాలలో బోనాల పండుగ ఉత్సవాలతో ఎంతో సందడిగా ఉంటుందని గుర్తు చేశారు. ఆగస్టు 2 వ తేదీన జరిగే శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరకు వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు డెక్కన్ మానవ సేవా సమితి, ఆర్య సమాజ్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్ తదితర సంస్థల ఆధ్వర్యంలో సేవలు అందిస్తారని చెప్పారు. ఎల్ నినో ప్రభావంతో సరైన వర్షాలు లేక రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అమ్మవారి దీవెనలతో విస్తారంగా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తలసాని ధర్మేందర్ యాదవ్, తలసాని స్కైలాబ్ యాదవ్, గందే నాగులు, టి. శ్రీహరి, ఆకుల హరికృష్ణ, కొండాపురం మహేష్ యాదవ్, రాం మోహన్ యాదవ్, ఆనంద్ పాటిల్, గణేష్, అరుణ్ భట్, శ్రీకాంత్ యాదవ్, సత్యనారాయణ, అమర్ తదితరులు పాల్గొన్నారు.



