‘ సమస్య అంటే కేవలం ఒక అర్జీ కాదు. ఒక కుటుంబానికి లేదా ఒక గ్రామానికి సంబంధించిన భావోద్వేగం…. పరిష్కారం లభిస్తుందనే నమ్మకం. ఆ సమస్యల పరిష్కారానికే జిల్లా యంత్రాంగం మొత్తం మీ మధ్యలోకి వచ్చింది. ఆర్థికేతర సమస్యలకు కచ్చితంగా సత్వర పరిష్కారం చూపుతాం. ఆర్థికపరమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తాం ‘… అని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ముండ్లమూరు మండలం మారెళ్ళ గ్రామంలో ‘ పల్లెనిద్ర ‘ చేశారు. ప్రజలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి శ్రీమతి గొట్టిపాటి లక్ష్మీతో కలిసి స్థానికుల నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో ప్రజలతో ముఖాముఖి చర్చించి వారి సమస్యలను సత్వరం పరిష్కరించేందుకే ‘ పల్లెనిద్ర ‘ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మెరుగైన జీవనోపాధి కోసం ఉపయోగించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ మనమిత్ర ‘ వాట్సప్ సేవలు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ‘ కౌశలం ‘, విపత్తుల సమాచారాన్ని క్షణాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచే ‘ అవేర్ 2.0 ‘ ఆన్లైన్ పోర్టల్ గురించి స్వయంగా కలెక్టరే ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలోని గర్భిణులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. తల్లీబిడ్డ ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. అంగన్వాడీ, ఏ.ఎన్.ఎం.ల ద్వారా లభిస్తున్న సేవలను వినియోగించుకోవాలని, పోషకాహారం తీసుకుంటూ సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందించారు. కాగా, వైద్యుల ద్వారా పొందుతున్న సేవలపై గర్భిణులు సంతృప్తి వ్యక్తం చేశారు.
స్థానికులు మాట్లాడుతూ గ్రామంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. ఎస్సీ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని చెప్పారు. రోడ్లు కావాలని, స్కూలు ప్రాంగణంలో నిర్మించిన షాపులను త్వరగా కేటాయిస్తే పలువురికి ఉపాధి లభిస్తుందని అన్నారు. ప్రస్తుతం పట్టా భూమిని స్మశానంగా వినియోగించుకుంటున్నామని, అధికారికంగా స్మశానం కేటాయించాలని స్థానికులు కోరారు. పేదలు సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూమిని వారికే అసైన్మెంట్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
గ్రామస్తులు ప్రస్తావించిన సమస్యలను కలెక్టర్ ఓపికతో విన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి తక్షణమే దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని, అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆర్థికేతర సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
నియోజకవర్గ ఇన్చార్జి డా . గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ తో పాటు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు కూడా ముండ్లమూరు మండలంలోని అన్ని గ్రామాలలో పర్యటించడంపై సంతోషం వ్యక్తం చేశారు. అధికార యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయిలో పర్యటించడం వలన తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే విశ్వాసం ప్రజల్లో పెరిగిందన్నారు. స్థానికులు ప్రస్తావించిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీ సీ.ఈ.వో. చిరంజీవి, డిపిఓ అనుపమ, స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు సచివాలయాల జిల్లా అధికారి వెంకటేశ్వరరావు, ఆర్డిఓ విజయ జ్యోతి, వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
దీనికి ముందుగా మండలంలోని అన్ని గ్రామాల్లో జిల్లా స్థాయి అధికారులు పర్యటించి స్థానిక సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వాటిని పల్లెనిద్ర కార్యక్రమంలో కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కాగా, ఈ సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు తక్షణమే దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు.








