హైదరాబాద్ ఆగస్ట్ 24,(జే ఎస్ డి ఎం న్యూస్) : తెలంగాణకు హైదరాబాద్ వాతారవణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో వర్షాలకు బ్రేక్ పడగా.. మళ్లీ విస్తృతంగా కురుస్తాయని అధికారులు తెలిపారు.
వాయువ్య బంగాళాఖతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ప్రస్తుతం అల్పపీడనం కేంద్రీకృతమై ఉండగా అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడిందని చెప్పారు. ఈ క్రమంలో నేడు, రేపు (సోమ, మంగళవారాల్లో) ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ముఖ్యంగా కొమురం భీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మిగిలిన జిల్లాల్లోనూ పలుచోట్ల ఓ మోస్తరుగా కురుస్తాయని అంచనా వేశారు.
ఇక ఆదివారం (ఆగస్టు 23) సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో అత్యధికంగా 6.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కామారెడ్డి జిల్లా పిట్లంలో 5.1 సెం.మీ, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరిలో 5.1 సెం.మీ, మెదక్ జిల్లా నర్సాపూర్‌లో 4.7 సెం.మీ, పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్, ముత్తారంలలో 4.5 సెం.మీ, సంగారెడ్డి జిల్లా కల్హేర్‌లో 4.2 సెం.మీ, మెదక్ జిల్లా టేక్మల్‌లో 4.2 సెం.మీ, కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో 3.8 సెం.మీ చొప్పు వర్షపాతం నమోదైందన్నారు. హైదరాబాద్, ములుగు, యాదాద్రి భువనగిరి, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసినట్లు వెల్లడించారు. నేడు కూడా హైదరాబాద్ నగరంలో వర్షం కురిసే అవకాశం ఉందని నగరవాసులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
కాగా, తెలంగాణలో ఈ ఏడాది ఆశించినంతగా వర్షాలు కురవటం లేదు. నైరుతి రుతుపవనాల ప్రారంభంలోనే లోటు వర్షపాతం నమోదైంది. జూన్, జులై మొదటి వారాల్లో తెలంగాణ సగటు సాధారణ వర్షపాతం కంటే సుమారు 20 శాతం నుంచి 23 శాతం వరకు తక్కువ వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. దాదాపు 22 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 50 శాతానికి పైగా తీవ్ర వర్షపాత లోటు ఏర్పడింది. అయితే, ఈ నెలలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు, ద్రోణుల ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తర, తూర్పు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల వల్ల లోటు కొంతవరకు భర్తీ అయి చెరువులు, జలాశయాల్లో నీటిమట్టం మెరుగైంది. చాలా చోట్ల పంటలు మాత్రం దెబ్బతిన్నాయి. సకాలంలో వర్షాలు లేక మెజార్టీ జిల్లాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది.
