హైదరాబాద్ ఆగస్ట్ 25,(జే ఎస్ డి ఎం న్యూస్)
ఎలాంటి అర్హత లేకుండా డాక్టర్ల అవతారమెత్తి అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆరుగురు నకిలీ వైద్యుల ముఠా ఆటను హైదరాబాద్ కమీషనర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కట్టించారు. సికింద్రాబాద్ జోన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ తెలిపారు.
విశ్వసనీయ సమాచారం మేరకు సికింద్రాబాద్ టాస్క్‌ఫోర్స్ బృందం స్థానిక రాంగోపాల్‌పేట్, చిలకలగూడ, ఓయూ సిటీ, దొమల్‌గూడ పోలీస్ స్టేషన్ల సిబ్బందితో కలసి క్లినిక్‌లపై మెరుపు దాడులు చేపట్టింది. చిలకలగూడలో ‘ఫ్యామిలీ క్లినిక్’ పేరిట నకిలీ ఎంబీబీఎస్, బీహెచ్‌ఎంఎస్ సర్టిఫికెట్లతో చలామణి అవుతున్న కాంపౌండర్ నీలగిరి ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అలాగే రాణిగంజ్‌లో ‘సంధాని క్లినిక్’ నిర్వహిస్తూ ఇంట్లోనే తయారుచేసిన మిశ్రమాలను సోరియాసిస్ వ్యాధికి మందుగా ఇస్తున్న అదన్ సంధాని, లోయర్ ట్యాంక్‌బండ్‌లోని ‘సాయి రామ్ క్లినిక్’ లో గత 26 ఏళ్లుగా కాంపౌండర్ అనుభవంతో డాక్టర్‌గా వ్యవహరిస్తున్న ఎం. శ్రీనివాస్‌ను పోలీసులు పట్టుకున్నారు. వీటితో పాటు చిలకలగూడలో ‘సాయి రామ్ క్లినిక్’ నడుపుతున్న పెద్దపాట్ల సదానంద్, మణికేశ్వర్‌నగర్‌లో ‘సరోజిని పాలి క్లినిక్’ నిర్వహిస్తున్న చింతలూరి రమేష్, అదే ప్రాంతంలో 15 ఏళ్లుగా ‘సూర్య క్లినిక్’ నడుపుతున్న శివరాత్రి లింగయ్యలను పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుల నుంచి పెద్ద ఎత్తున నకిలీ ఎంబీబీఎస్ సర్టిఫికెట్లు, స్టెతస్కోప్‌లు, బీపీ మిషన్లు, ప్రిస్క్రిప్షన్ ప్యాడ్‌లు, స్టాంపులతో పాటు 277 ఇంజెక్షన్లు, 933 మాత్రలు, సెలైన్ బాటిళ్లు, వైద్య పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. సరైన గుర్తింపు, అర్హత పత్రాలు లేని నకిలీ డాక్టర్ల వద్దకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, అనుమానాస్పద క్లినిక్‌ల వివరాలు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని డీసీపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ జె. రాజశేఖర్ నేతృత్వంలోని అధికారుల బృందం ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు.


