ఫిన్లాండ్‌ శిక్షణ పూర్తి చేసి స్వదేశానికి ఈశ్వరీభూషణం -హైదరాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం

హైదరాబాద్‌: ఫిన్లాండ్‌ దేశంలోని తుర్కు యూనివర్సిటీలో నిర్వహించిన అంతర్జాతీయ ఎఫ్‌.ఎల్‌.ఎన్‌ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని, శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయిని ఈశ్వరీభూషణం శుక్రవారం స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమెకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, సాహితీవేత్తలు ఘనంగా స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు ప్రపంచంలోనే అత్యంత గొప్ప విద్యా విధానాన్ని అమలు చేస్తున్న ఫిల్యాండ్ దేశం ఈశ్వరీభూషణం పర్యటించారు. అక్కడి విద్యా విధానం, విద్యార్థి కేంద్రంగా బోధన, అనుభవాత్మక అభ్యసనం, సృజనాత్మక బోధనా పద్ధతులు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించే విధానాలపై ప్రత్యేక శిక్షణ పొందారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఫిన్లాండ్‌ విద్యా విధానంలో ఉపాధ్యాయుడి పాత్ర, విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా బోధనను రూపొందించే విధానం, తరగతి గదిలో ఆచరణాత్మక అభ్యసనకు ఇచ్చే ప్రాధాన్యత వంటి అంశాలను ఆమె పరిశీలించారు. ఈ శిక్షణ ద్వారా పొందిన అనుభవాలు ప్రభుత్వ పాఠశాలల్లో మరింత నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపయోగపడతాయని ఆమె తెలిపారు.

ఇప్పటికే తరగతి గదిలో ‘లెర్నింగ్‌ బై డూయింగ్‌’, ఎఫ్‌.ఎల్‌.ఎన్‌ వంటి ఆధునిక బోధనా పద్ధతులను అమలు చేస్తున్న ఈశ్వరీభూషణం, ఫిన్లాండ్‌లో నేర్చుకున్న నూతన విధానాలను కూడా విద్యార్థుల అభ్యసనకు అనుగుణంగా బోధన చేస్తానని తెలిపారు. తక్కువ ఖర్చుతో టీఎల్‌ఎంలను రూపొందిస్తూ సృజనాత్మక బోధన అందించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

ఉపాధ్యాయురాలిగా విద్యార్థుల విద్యాభివృద్ధితో పాటు బాలికల విద్య, పేద విద్యార్థులకు సహాయం, తల్లిదండ్రుల భాగస్వామ్యం వంటి అంశాల్లో ఈశ్వరీభూషణం చేస్తున్న కృషిని పలువురు అభినందించారు.

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయిగా ఎంపికై అంతర్జాతీయ స్థాయి శిక్షణకు హాజరై తిరిగి రావడం తమకు ఎంతో గర్వకారణమని కుటుంబ సభ్యులు, స్నేహితులు తెలిపారు. ఫిన్లాండ్‌ శిక్షణలో పొందిన జ్ఞానం, అనుభవాలను జిల్లాలోని ఇతర ఉపాధ్యాయులతో పంచుకుని విద్యా ప్రగతికి మరింతగా కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఈశ్వరీభూషణం మాట్లాడుతూ ఫిన్లాండ్‌లో పొందిన శిక్షణ తన వృత్తి జీవితంలో ఎంతో విలువైన అనుభవంగా నిలిచిందన్నారు. అక్కడి విద్యా విధానంలోని మంచి అంశాలను మన పాఠశాలల పరిస్థితులకు అనుగుణంగా అమలు చేసి విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను మరింత పెంపొందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *