బాల్య వివాహాలపై పోరాటానికి ప్రపంచ గుర్తింపు – నవంబర్‌ 27న బాల్య వివాహాల నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం – యూఎన్ నిర్ణయంపై ‘అశ్రిత’ హర్షం

హైదరాబాద్‌: బాల్య వివాహాల నిర్మూలన కోసం ‘జస్ట్‌ రైట్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌’ (జేఆర్‌సీ) చేపట్టిన పోరాటానికి ఐక్యరాజ్యసమితి వేదికగా అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రతి ఏటా నవంబర్‌ 27వ తేదీని బాల్య, ముందస్తు, బలవంతపు వివాహాల నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటిస్తూ ఐక్యరాజ్యసమితి సాధారణ సభ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామాన్ని హైదరాబాద్‌ జిల్లాలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ‘అశ్రిత’ స్వచ్ఛంద సంస్థ ఘనంగా స్వాగతించింది. భారత ప్రభుత్వం, జేఆర్‌సీ భాగస్వామ్య సంస్థలు కలిసి ప్రారంభించిన ఉద్యమం నేడు అంతర్జాతీయ స్థాయికి చేరడం దేశానికే గర్వకారణమని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.
ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అశ్రిత డైరెక్టర్‌ ఎస్‌. నాగరాజు మాట్లాడుతూ, కేవలం ఒక దినోత్సవాన్ని ప్రకటించడంతోనే ఈ సమస్య పరిష్కారం కాదని, క్షేత్రస్థాయిలో విస్తృతమైన కార్యాచరణ అవసరమని స్పష్టం చేశారు. చట్టాలతో పాటు ప్రజల్లో సామాజిక చైతన్యం తీసుకురావడం, బాలికలకు విద్యావకాశాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా చూడటమే శాశ్వత పరిష్కారమని తెలిపారు. పాఠశాలలు, గ్రామాలు, పంచాయతీల వారీగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని, హైదరాబాద్‌ జిల్లా పరిధిలోనే చట్టపరమైన జోక్యంతో ఇప్పటివరకు 242 బాల్య వివాహాలను నిలువరించినట్లు ఆయన వెల్లడించారు.
జేఆర్‌సీ వ్యవస్థాపకుడు భువన్‌ రిభు అంతర్జాతీయ వేదికలపై చేపట్టిన ఉద్యమ ఫలితంగానే ఈ కీలక గుర్తింపు సాధ్యమైంది. గతంలో ఐక్యరాజ్యసమితిలో ఆయన లేవనెత్తిన ఈ అంశానికి సియెర్రా లియోన్‌ నేతృత్వంలో భారత్‌ సహా 67 దేశాలు మద్దతు పలికాయి. ఈ క్రమంలో ప్రవేశపెట్టిన తీర్మానానికి ఐక్యరాజ్యసమితి ఆమోదముద్ర వేసింది.
ప్రస్తుతం భారత్‌లోని 782 జిల్లాల్లో ప్రభుత్వ విభాగాలు, పోలీసులు, పంచాయతీలు, మహిళా సంఘాలు, మతపెద్దలను ఏకం చేస్తూ జేఆర్‌సీ నిర్వహిస్తున్న ఉద్యమం ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 55 లక్షలకు పైగా బాల్య వివాహాలను అడ్డుకోగలిగారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం దేశంలో బాల్య వివాహాల శాతం తగ్గుముఖం పడుతుండటం సానుకూల పరిణామమని, 2030 నాటికి నిర్దేశించుకున్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా ఈ రుగ్మతను సమూలంగా తుడిచిపెట్టేందుకు సమాజం అంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *