ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లల శ్రేయస్సు కోసం అందిస్తున్న పౌష్టికాహార పథకాల్లో ఎలాంటి అక్రమాలు, అలసత్వం జరగడానికి వీల్లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ గురుకులాలు, వసతి గృహాలలో నిర్ణయించిన ఆహార పట్టిక (మెనూ) ప్రకారం నాణ్యమైన భోజనం అందించకపోతే బాధ్యులైన అధికారులపై తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంగళవారం ఆయన ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల కేంద్రంలో విస్తృతంగా పర్యటించి పాఠశాలలు, చౌక ధరల దుకాణాలు, సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ పర్యటనలో భాగంగా ముందుగా స్థానిక డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ గురుకుల బాలికల పాఠశాలను సందర్శించిన చైర్మన్, తరగతి గదులు, వంటశాల, స్టోర్ రూమ్‌లను స్వయంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థినులతో నేరుగా ముఖాముఖిగా మాట్లాడి, వారికి అందుతున్న వసతి సౌకర్యాలు, మెనూ ప్రకారం రోజూ అందిస్తున్న భోజన నాణ్యత, తాగునీటి సదుపాయాల గురించి సమగ్రంగా అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో వసతులు, ఆహారం చాలా బాగున్నాయని విద్యార్థినులు సంతృప్తి వ్యక్తం చేయడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. సుమారు 700 మంది విద్యార్థినులు ఉన్న ఈ భారీ గురుకులంలో స్టాక్ రిజిస్టర్లు, సరుకుల నిర్వహణ అత్యంత పారదర్శకంగా ఉండడాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఇదే సమయంలో పాఠశాల వంటశాలలో ఆహార పదార్థాలు వేగంగా, శుచిగా వండటానికి మరికొన్ని ఆధునిక పరికరాలు అవసరమని గుర్తించిన ఆయన, ఈ విషయాన్ని తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం సింగరాయకొండ పట్టణంలోని రెండు చౌక ధరల (రేషన్) దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఫుడ్ కమిషన్ చైర్మన్, సరుకుల నిల్వలు మరియు పంపిణీ తీరును పరిశీలించారు. అక్కడ విక్రయాల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే, రేషన్ డీలర్లకు పలు పటిష్టమైన సూచనలు చేశారు. ముఖ్యంగా రేషన్ పంపిణీ సమయంలో చిల్లర నాణేల కొరత వల్ల లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా ఉండటానికి డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలని ఆదేశించారు. అందుకోసం ప్రతీ చౌక ధరల దుకాణం వద్ద ఫోన్ పే (PhonePe) లేదా ఇతర క్యూఆర్ (QR) స్కానర్ ప్రింట్లను స్పష్టంగా కనిపించేలా అతికించాలని చెప్పారు. డిజిటల్ చెల్లింపుల వల్ల పారదర్శకత పెరుగుతుందన్నారు. రేషన్ పంపిణీలో లబ్ధిదారుల నుండి అదనంగా రూపాయి వసూలు చేసినా, లేదా బియ్యానికి బదులుగా నగదు ఇస్తూ అక్రమాలకు పాల్పడినా చట్టపరంగా కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మండలంలోని అంగన్‌వాడీ కేంద్రాల పనితీరుపై సమీక్షిస్తూ, గతంతో పోలిస్తే ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ కొంత మెరుగుపడిందని, అయితే ఇంకా మెరుగైన సేవలు అందించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. కొందరు సిబ్బంది కేంద్రాలకు రాకుండా ఇష్టారాజ్యంగా హాజరు నమోదు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. చిన్న పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అత్యంత పరిశుభ్రమైన, పోషకాలతో కూడిన ఆహారాన్ని మాత్రమే అందించాలని చెప్పారు. అధికారులెవరూ మెనూ అమలులో ఎలాంటి పొరపాట్లు చేయకుండా క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
చివరగా, సింగరాయకొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహాన్ని (హాస్టల్) సందర్శించి, అక్కడ విద్యార్థుల వసతి, విద్యుత్, తాగునీరు మరియు భోజన నాణ్యతను తనిఖీ చేశారు. హాస్టల్ నిర్వహణ, ఆహార నాణ్యత బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ సక్రమంగా అందేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని, ఆహార భద్రతా చట్టం ప్రకారం విద్యార్థులకు, లబ్ధిదారులకు దక్కాల్సిన హక్కులకు ఏమాత్రం భంగం వాటిల్లనివ్వకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
- అంతకముందు కొండేపి గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో డి.ఎస్. వో. పద్మశ్రీ, సాంఘీక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మానాయక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

