ప్రకాశం జిల్లాకు దక్కిన అరుదైన గౌరవం -చెత్త నిర్మూలనలో ఒంగోలు నగరపాలక సంస్థ ‘గ్రీన్ గోల్డ్’ రికార్డు.. కలెక్టర్ పి. రాజా బాబు ప్రెజెంటేషన్‌పై సీఎం చంద్రబాబు ప్రశంసల వర్షం

విజయవాడలో శుక్రవారం నిర్వహించిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో ప్రకాశం జిల్లా ప్రతిపాదించిన వ్యర్థాల నిర్వహణ నమూనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒంగోలు నగర పాలక సంస్థ పరిధిలో వినూత్నంగా అమలు చేస్తున్న “వేస్ట్ టు వెల్త్ – సర్క్యులర్ ఎకానమీ” (Waste to Wealth – Circular Economy) ప్రాజెక్టులోని ప్రతి దశను ప్రకాశం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ పి. రాజా బాబు సమగ్రంగా వివరించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు స్థానిక సంస్థలకు రాబడి సమకూర్చే దిశగా ప్రకాశం జిల్లా యంత్రాంగం సాధించిన ఈ విజయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించడమే కాకుండా, ఇతర జిల్లాలకు ఇదొక మార్గదర్శకమని కొనియాడారు.
​ఈ సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ ఒంగోలు నగరంలో ప్రతిరోజూ ఉత్పత్తవుతున్న 125 టన్నుల వ్యర్థాల పూర్తి వివరాలను వెల్లడించారు. అందులో 87.5 టన్నుల తడి చెత్త, 25 టన్నుల పొడి చెత్త, 3.75 టన్నుల ప్రమాదకర వ్యర్థాలు మరియు 8.75 టన్నుల ఇనర్ట్ వ్యర్థాలు ఉంటాయి. డంపింగ్ యార్డ్ పై భారాన్ని తగ్గించేందుకు గాను బల్క్ వేస్ట్ జనరేటర్ల నుండి రోజుకు 3 టన్నులు, రైతు బజార్లు మరియు కొత్త కూరగాయల మార్కెట్ నుండి 8 టన్నులు, ఇళ్ల నుండి 76.5 టన్నులు, వాణిజ్య సముదాయాల నుండి 6 టన్నుల చొప్పున చెత్తను మూలం వద్దే వర్గీకరించి సేకరిస్తున్నామన్నారు. అలాగే, గతంలో కొండలా పేరుకుపోయిన ‘లేగసీ వేస్ట్’ నిర్మూలనలోనూ అసాధారణ పురోగతి సాధించి, జూన్ 2025 నుండి ఇప్పటివరకు సుమారు 1,85,691 మెట్రిక్ టన్నుల చెత్తను విజయవంతంగా క్లియర్ చేశామని, ప్రస్తుతం 1,37,090.5 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపారు.
​సేకరించిన తడి చెత్తను రవాణా చేసి కంపోస్ట్ యార్డులో క్రషింగ్ ద్వారా బెడ్‌లుగా తయారు చేసిన తర్వాత, ‘BIOWIZARD’ అనే మైక్రోబయల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ఎంజైమ్‌లు, ఎస్సెన్షియల్ ఆయిల్స్ మరియు అవసరమైన పోషకాలతో కూడిన ఒక కిలో మైక్రోబ్స్ పౌడర్‌ను 200 లీటర్ల నీటిలో కలిపి 8 గంటలు ఉంచడం ద్వారా జీవం పోసుకునే ఈ సూక్ష్మజీవులు తడి చెత్తను వేగంగా తినివేసి, పోషకాలతో కూడిన కంపోస్ట్‌గా మారుస్తాయని పేర్కొన్నారు. రూ. 12,800 విలువైన ఒక కేజీ పౌడర్‌తో 40 టన్నుల తడి చెత్తను ప్రాసెస్ చేసి 25 నుండి 28 టన్నుల నాణ్యమైన కంపోస్ట్‌ను తయారు చేయవచ్చని, ఇది దుర్వాసన మరియు ఈగల బెడదను పూర్తిగా నివారిస్తుందని వివరించారు.
​ఈ విధంగా తయారుచేసిన ఆర్గానిక్ కంపోస్ట్‌ను ఒంగోలు నగరపాలక సంస్థ తరఫున “GREEN GOLD” (గ్రీన్ గోల్డ్) అనే పేరుతో బ్రాండింగ్ చేశామని తెలిపారు. కిలో రూ. 10 చొప్పున విక్రయించడం ద్వారా నెలకు రూ. 2.5 లక్షల నుండి రూ. 2.8 లక్షల వరకు ఆదాయం రాబడుతున్నామని పేర్కొన్నారు. ఈ ఎరువు నాణ్యతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ శాఖ బయో ఫెర్టిలైజర్ అండ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ క్వాలిటీ కంట్రోల్ లాబొరేటరీ (నెల్లూరు) తో పాటు, కేంద్ర ప్రభుత్వ అగ్మార్క్ (AGMARK) ఆమోదం పొందిన మహారాష్ట్రలోని ‘నిఖిల్ అనలిటికల్ అండ్ రీసెర్చ్’ సంస్థలు క్షుణ్ణంగా పరీక్షించి ధృవీకరించాయన్నారు. ప్రస్తుతం ఈ ‘గ్రీన్ గోల్డ్’ ఎరువును పైలట్ ప్రాజెక్ట్‌గా నగరంలోని పార్కులు, రోడ్డు డివైడర్లు, టెర్రస్ గార్డెనింగ్ మరియు సేంద్రీయ వ్యవసాయంలో పునర్వినియోగిస్తూ, చెత్త నుండి సంపద సృష్టిస్తూ విజయవంతంగా ‘సర్క్యులర్ ఎకానమీ’ని అమలు చేస్తున్నామని కలెక్టర్ సభకు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏవి కూడా ప్రజెంట్ చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *