విలువలు బతికితేనే బంధాలు బలపడతాయి.ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు పొన్నం కుటుంబం ఆదర్శం…..వ్యవసాయం, రైతుకు విలువ ఇవ్వడంలో పొన్నం సత్తయ్య స్ఫూర్తిదాయకం….కొత్త తరానికి కుటుంబ విలువలు అందించాలి – శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.

హైదరాబాద్, సెప్టెంబర్ 13,(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఆస్తులు తరాలకు అందుతాయి.కానీ విలువలు తరాలను కలుపుతాయి. కుటుంబ బంధాలు క్రమంగా బలహీనపడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేమ, ఆప్యాయత, పరస్పర సహకారంతో ముగ్గురు అన్నదమ్ములు ఐక్యంగా కొనసాగుతున్న పొన్నం కుటుంబం సమాజానికి ఆదర్శంగా నిలుస్తోందని పలువురు వక్తలు కొనియాడారు.వ్యవసాయం, రైతు సంక్షేమం, మానవ సంబంధాలు, కుటుంబ విలువలకు జీవితాంతం ప్రాధాన్యత ఇచ్చిన పొన్నం సత్తయ్య గౌడ్ ఆశయాలను ఆయన కుటుంబ సభ్యులు కొనసాగిస్తున్నారని ప్రశంసించారు. పొన్నం సత్తయ్య గౌడ్ 16వ వర్ధంతి సందర్భంగా ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జీవన సాఫల్య పురస్కారాల కార్యక్రమం విలువలకు వేదికగా మారింది.
వ్యవసాయమే గ్రామీణ జీవనానికి ఆధారం.
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ సమాజంలోవ్యవసాయానికి, రైతుకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు.వ్యవసాయానికి విలువనిస్తూ రైతుజీవితాన్ని గౌరవించిన వ్యక్తిగా పొన్నం సత్తయ్య నిలిచారని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు బలంగా ఉండేవని, కుటుంబంలో ఎవరికైనా కష్టం వస్తే మరొకరు అండగా నిలిచేవారని గుర్తుచేశారు. పెద్దలు తమ అనుభవాలను చిన్నవారికి పంచుకోవడం, చిన్నవారు తమ సమస్యలను పెద్దలతో చెప్పుకోవడం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గొప్పతనమన్నారు.
బంధాలు బలహీనమైతే. సమాజంపైనా ప్రభావం.
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోతుండటంతో కుటుంబ బంధాలు బలహీనపడుతున్నాయని, దాని ప్రభావం సమాజంపైనా పడుతోందన్నారు. ఒంటరితనం, అసంతృప్తి, కుటుంబ సమస్యలు పెరుగుతున్న పరిస్థితుల్లో మానవ సంబంధాలు, కుటుంబ విలువలను కొత్త తరానికి అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. పొన్నం సత్తయ్య జీవితం కుటుంబ విలువలు, మానవత్వం, వ్యవసాయం పట్ల నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు.
పొన్నం కుటుంబం. విలువలకు ప్రతిరూపం.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ పొన్నం కుటుంబంతో తనకు ఆత్మీయ అనుబంధం ఉందన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఎప్పుడూ ప్రేమ, ఆప్యాయతలతో అందరినీ పలకరిస్తూ ఉంటారని, కాంగ్రెస్‌లోని ప్రతి కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులను సోదరభావంతో కలుపుకుపోయే నాయకుడిగా ఉన్నారని చెప్పారు. పొన్నం సత్తయ్య చూపిన మార్గం, కుటుంబ విలువలు నేటికీ కుటుంబంలో కొనసాగుతున్నాయని, ముగ్గురు అన్నదమ్ములు ఐక్యంగా, ప్రేమగా ఉండటం ఎంతో సంతోషాన్ని కలిగించే విషయమన్నారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఆప్యాయతలు, పరస్పర సహకారం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగానిలుస్తున్నాయని, తండ్రి ఆశయాలను కుటుంబ సభ్యులు ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. పొన్నం ప్రభాకర్ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలతో పాటు పేదలు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని, సామాజికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు విద్య, శిక్షణ, అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. ఉన్నత చదువులు, విదేశీ విద్యకు పేద, బలహీన వర్గాల విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలకు మద్దతుగా నిలుస్తున్నారని చెప్పారు. పేదలు, బలహీన వర్గాల కోసం చేస్తున్న సేవల వల్ల ప్రభాకర్‌కు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోందని, ప్రజల పట్ల ఉన్న ప్రేమ, సేవాభావమే అందుకు కారణమన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

‘జై తెలంగాణ’ నినాదం నుంచి మంత్రి స్థాయికి
మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో పొన్నం ప్రభాకర్ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. యువజన కాంగ్రెస్‌లో పోరాట స్ఫూర్తిని నింపి, ఎక్కడ ఉద్యమం జరిగినా ముందుండేవారని తెలిపారు. పార్లమెంట్‌లోనూ బలంగా ‘జై తెలంగాణ’ నినాదాన్ని వినిపించారని అన్నారు. ఆ పోరాట స్ఫూర్తి, ప్రజల పట్ల నిబద్ధతలో పొన్నం సత్తయ్య విలువల ప్రభావం కనిపిస్తోందన్నారు.
రైతు గౌరవమే నాకు దక్కిన గౌరవం
వ్యవసాయ పురస్కార గ్రహీత, వ్యవసాయ కమిషన్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి మాట్లాడుతూ తనకు దక్కిన పురస్కారం వ్యక్తిగత గౌరవం కాదని, తెలంగాణ రైతులకు దక్కిన గౌరవమన్నారు. తాను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చానని, చిన్ననాటి నుంచే వ్యవసాయంతో అనుబంధం ఉందన్నారు. రైతుల అప్పులు, ప్రకృతి వైపరీత్యాలు, కౌలు రైతులు, చిన్న రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ప్రస్తావించారు. రైతులు సంఘటితంగా ఉండాల్సిన అవసరం ఉందని, రైతు సంఘాలు, ఎఫ్‌పీవోల ద్వారా తమ హక్కులను కాపాడుకోవాలని సూచించారు.

ఐదో ఏడాది నుంచి వ్యవసాయానికీ పురస్కారం

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తండ్రి పొన్నం సత్తయ్య జ్ఞాపకార్థం ప్రతి ఏడాది వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న వారిని గుర్తించి సత్కరిస్తున్నామని తెలిపారు. గత ఏడాది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనతో ఈ ఏడాది నుంచి వ్యవసాయ రంగాన్ని కూడా పురస్కారాల్లో చేర్చామని చెప్పారు. వ్యవసాయ రంగంలో రైతుల సమస్యల కోసం, వ్యవసాయ అభివృద్ధి కోసం పోరాడుతున్న ఎం. కోదండరెడ్డిని ఎంపిక చేసినట్లు తెలిపారు. సాహిత్య రంగంలో వెలిచాల కొండల్‌రావు, జానపద కళారంగంలో గొట్టె కనకవ్వలను సత్కరించారు. ఒక్కొక్కరికి జ్ఞాపికతో పాటు రూ.50 వేల నగదు పురస్కారాన్ని అందించారు.

తల్లిదండ్రులు ఇచ్చేది ఆస్తి కాదు.. విలువలు

తల్లిదండ్రులు పెద్దగా చదువుకోకపోయినా తమకు విద్య, క్రమశిక్షణ, విలువలు, సామాజిక బాధ్యతలను నేర్పించారని పొన్నం ప్రభాకర్ అన్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన తమకు వ్యవసాయం విలువ, రైతు కష్టం తెలుసునని పేర్కొన్నారు. తండ్రి పేరుతో కార్యక్రమాన్ని కొనసాగించడం ద్వారా ఆయన ఆశయాలను భవిష్యత్ తరాలకు అందించాలన్నదే తమ ఉద్దేశమన్నారు.

తండ్రి కష్టం.. పిల్లల విజయాలుగా

టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ పొన్నం సత్తయ్య తన జీవితాన్ని వ్యవసాయంతో పాటు పిల్లల భవిష్యత్తు కోసం అంకితం చేశారని అన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యవసాయ పనులు చేస్తూనే పిల్లలను ఉన్నతంగా చదివించాలనే దూరదృష్టితో వ్యవహరించారని తెలిపారు. ఆయన ముగ్గురు కుమారులు వివిధ రంగాల్లో రాణించడం తండ్రి కష్టం, విలువలకు ప్రతిఫలమన్నారు.

ఆస్తులకంటే విలువలే గొప్ప వారసత్వం

మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలకు ఇచ్చే గొప్ప వారసత్వం ఆస్తులు కాదని, మంచి ఆలోచనలు, ధైర్యం, విలువలు, కష్టాలను ఎదుర్కొనే శక్తి అని అన్నారు. కుటుంబం ఇచ్చే మానసిక బలం కష్టకాలంలో ఎంతో అవసరమని చెప్పారు. కుటుంబాల్లో ప్రేమ, గౌరవం, సహకారం పెరిగితే సమాజంలోనూ శాంతి, సామరస్యం పెరుగుతాయని అన్నారు.

ప్రతిభకు గుర్తింపు.. సమాజానికి స్ఫూర్తి

ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులతో పాటు సంస్కారం, సంప్రదాయం, సానుభూతి, మానవత్వాన్ని అందిస్తారని అన్నారు. ప్రస్తుతం మానవ సంబంధాలు బలహీనపడుతున్నాయని, కుటుంబ కలహాలు, హింస పెరుగుతున్న పరిస్థితుల్లో తల్లిదండ్రుల పట్ల ప్రేమ, గౌరవం, బాధ్యత మరింత అవసరమని పేర్కొన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ పొన్నం సత్తయ్య మానవ విలువలు, మానవ సంబంధాలు, కుటుంబ విలువలకు ప్రతీక అని అన్నారు. ఆయన ఆలోచనలు, ఆశయాలను తరతరాలకు అందించాలనే ఉద్దేశంతో పురస్కారాలను కొనసాగిస్తున్నామని తెలిపారు.సాహిత్య పురస్కార గ్రహీత వెలిచాల కొండల్‌రావు మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యం, అభిప్రాయాలు, ఆలోచనలకు ప్రజాస్వామ్యంలో ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. భిన్నమైన భావాలు, సిద్ధాంతాలకు చెందిన వ్యక్తులు ఒకే వేదికపై కలవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనమన్నారు.

విలువలకు వేదికగా.. సేవలకు గుర్తింపుగా

పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారాలు–2026లో వ్యవసాయ రంగానికి ఎం. కోదండరెడ్డి, సాహిత్య రంగానికి వెలిచాల కొండల్‌రావు, జానపద కళారంగానికి గొట్టె కనకవ్వలను ఎంపిక చేశారు. ఒక్కొక్కరికి జ్ఞాపికతో పాటు రూ.50 వేల నగదు పురస్కారం అందించారు.

కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఈర్లపల్లి శంకరయ్య,నవీన్ యాదవ్, కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, ప్రొఫెసర్ హరగోపాల్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్,వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బాలమాయాదేవి, అధికారులు,ప్రజాప్రతినిధులు, పొన్నం కుటుంబ సభ్యులు, అభిమానులు, సాహిత్య, కళా, వ్యవసాయ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *