సికింద్రాబాద్ సెప్టెంబర్15,(జే ఎస్ డి ఎం న్యూస్) :
షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరిట జరిగిన ఆర్థిక లావాదేవీల వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కుమారుడు డబ్బులు ఎగ్గొట్టి పారిపోవడంతో, అతడి తండ్రిపై కక్ష పెంచుకున్న ఓ వ్యక్తి కత్తితో పొడిచి దారుణంగా హతమార్చిన ఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముషీరాబాద్ భోలక్‌పూర్‌కు చెందిన మహ్మద్ నిజాముద్దీన్ (36) నిరుద్యోగిగా ఉంటున్నాడు. ఇతనికి చిలకలగూడ నామాలగుండు ప్రాంతానికి చెందిన సుమన్‌తో గతంలో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో షేర్ మార్కెట్ ట్రేడింగ్, పెట్టుబడుల పేరుతో సుమన్ సుమారు రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు నిజాముద్దీన్ వద్ద తీసుకున్నాడు. అయితే అనుకున్న విధంగా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడమే కాకుండా, కొద్దిరోజులుగా నిజాముద్దీన్‌కు సుమన్ కనిపించకుండా తప్పించుకు తిరుగుతున్నాడు.తన డబ్బులు తిరిగి రాకపోవడం, సుమన్ జాడ తెలియకపోవడంతో తీవ్ర ఆక్రోశం పెంచుకున్న నిజాముద్దీన్ ఎలాగైనా అతడి కుటుంబంపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. సుమన్ ఇంట్లో ఉండటం లేదని తెలుసుకుని, అతడి తండ్రి శ్రీనివాస్ (56)ను లక్ష్యంగా చేసుకున్నాడు.
మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో మైలార్‌గడ్డలోని ఎవర్‌గ్రీన్ టెంట్ హౌస్ సమీపంలో శ్రీనివాస్ ఉండగా.అక్కడకు చేరుకున్న నిజాముద్దీన్ ఒక్కసారిగా కత్తితో అతడి పొట్టలో రెండుసార్లు బలంగా పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిన శ్రీనివాస్‌ను స్థానికులు వెంటనే టీజీఎస్‌ఆర్టీసీ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి అత్యంత విషమించడంతో చికిత్స పొందుతూ రాత్రి 9.05 గంటలకు ఆయన మృతి చెందినట్లు సీఎంవో డాక్టర్ వెంకటస్వామి ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న చిలకలగూడ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుడు మహ్మద్ నిజాముద్దీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

