లాలాగూడ కార్తీక్ హత్య కేసును ఛేదించిన పోలీసులు – ఐదుగురు నిందితుల అరెస్ట్

లాలాగూడ సెప్టెంబర్ 16,(జే ఎస్ డి ఎం న్యూస్) :
సికింద్రాబాద్ పరిధిలోని లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపిన బూరుగు కార్తీక్ హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. పాత కక్షలతో పథకం ప్రకారం జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. సెప్టెంబర్ 13 రాత్రి 8:50 గంటల సమయంలో తుకారాం గేట్
సాయి నగర్‌లోని నాగేష్ ఇంటి ఎదురుగా ఉన్న గణేష్ మండపం వద్ద ఈ దారుణం చోటుచేసుకుంది. గతంలో రాజమండ్రి కార్తీక్, భానుశ్రీ ప్రేమ వివాహానికి మృతుడు బూరుగు కార్తీక్ సహకరించాడన్న అక్కసుతో నిందితుల కుటుంబం అతనిపై తీవ్ర ద్వేషాన్ని పెంచుకుంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 13న సాయంత్రం ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం రాత్రి సమయంలో కార్తీక్ తన స్నేహితులతో కలిసి మళ్లీ అక్కడికి చేరుకోగా, కాపుకాసిన నిందితులు ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. సీసీటీవీ దృశ్యాలు, ప్రత్యక్ష సాక్ష్యాల ప్రకారం నిందితులు కార్తీక్ మెడపై పదునైన ఆయుధంతో విచక్షణారహితంగా దాడి చేశారన్నారు.మిగతా నిందితులు వెదురు కర్రలతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన కార్తీక్, చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగామార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచాడన్నారు. మృతుడి భార్య బూరుగు అనుష ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన లాలాగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.పక్కా సాంకేతిక ఆధారాలతో నిందితులైన గద్ది మదన్ కుమార్, గద్ది ప్రవీణ్ కుమార్, గద్ది సాయి కుమార్, గద్ది నాగేష్ అలియాస్ నాగేశ్వర్ రావు, గద్ది నర్సింగ్ రావులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన రక్తపు మరకల కత్తి, వెదురు కర్రలతో పాటు కీలక డిజిటల్ ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. కేసును సత్వరమే ఛేదించిన లాలాగూడ ఎస్ హెచ్ ఓ
బి. రవి కిరణ్ బృందాన్ని, చిలకలగూడ ఏసీపీ కే. శశాంక్ రెడ్డి పర్యవేక్షణలో సికింద్రాబాద్ జోన్ అడిషనల్ డీసీపీ జె. నర్సయ్య ప్రత్యేకంగా అభినందించారు.
ఈ ఘటనపై సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి తీవ్రంగా స్పందిస్తూ సంఘ విద్రోహ శక్తులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రతీకార దాడులకు పాల్పడినా, అల్లర్లు సృష్టించినా లేదా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టినా కఠిన చర్యలు తప్పవని తేల్చిచెప్పారు. ప్రజల భద్రతకే తమ తొలి ప్రాధాన్యమని, నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఆమె స్పష్టం చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *