హైదరాబాద్ సెప్టెంబర్ 23,(జే ఎస్ డి ఎం న్యూస్) :
చంచల్‌గూడ కేంద్ర కారాగారం నుంచి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వచ్చి తప్పించుకున్న రిమాండ్ ఖైదీ కిషోర్ కుమార్ రెడ్డి మృతి చెందాడు. పోక్సో కేసులో చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న కిషోర్ కుమార్ రెడ్డిని అనారోగ్య సమస్యల కారణంగా అధికారులు ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో టాయిలెట్‌కు వెళ్తానని చెప్పి వెంటిలేటర్ ద్వారా బయటకు దూకి పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు.
ఖైదీ తప్పించుకున్న సమాచారంతో అప్రమత్తమైన జైలు అధికారులు, పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పరారీలో ఉన్న కిషోర్ కుమార్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, అతడు ఎలా మృతి చెందాడు, ఎక్కడికి వెళ్లాడనే కోణంలో సమగ్ర దర్యాప్తు ముమ్మరం చేశారు.
