
ఒంగోలు లోని బచ్చల బాలయ్య కళ్యాణ మండపంలో ఆత్మ (ATMA) సౌజన్యంతో నిర్వహించిన “కిసాన్ మేళా 2026 – రైతులతో శాస్త్రవేత్తల ముఖాముఖి” కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి స్వామి ముఖ్య అతిథిగా పాల్గొని, జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీమతి ముప్పవరపు సుచిత్రతో కలిసి వ్యవసాయ మరియు సంబంధిత శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శనా స్టాళ్లను మంత్రి పరిశీలించి, అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి డోలా . శ్రీ బాల వీరాంజనేయస్వామి స్వామి మాట్లాడుతూ, ప్రకృతి వైపరీత్యాలు మరియు తీవ్రమైన ఎల్ ని నో ప్రభావం వల్ల వర్షాభావ కరువు పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ, రాష్ట్రంలోని ఏ ఒక్క ఎకరం పొలాన్ని కూడా విత్తనం వేయకుండా వదిలేయకూడదనేది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా. చంద్రబాబు నాయుడు ప్రధాన లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయస్వామి స్పష్టం చేశారు.మారుతున్న కాలానికి అనుగుణంగా రైతు సేవా కేంద్రాల (RSK) ద్వారా రైతులకు ఆధునిక సేద్యపు పద్ధతులపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖపై ఉందన్నారు. ప్రస్తుతం జిల్లాలో 58 శాతం వర్షపాత లోటు నమోదై తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నప్పటికీ రైతులు అధైర్యపడవద్దని ఆయన కోరారు. భూమిలో సరిపడా తేమ లేకపోయినా వర్షం పడగానే మొలకెత్తేలా ప్రత్యేకంగా కోటింగ్ చేసిన పిఎమ్ సీడ్స్ (PM Seeds / Seed Balls) చల్లడాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, దీనివల్ల ప్రతి ఎకరంలోనూ కనీసం పశువులకు మేతైనా పండుతుందని వెల్లడించారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సబ్సిడీపై పంపిణీ చేసే ప్రత్యామ్నాయ విత్తనాల ద్వారా వచ్చే దిగుబడులను ‘బై-బ్యాక్ పాలసీ’ (Buy-Back Policy) కింద ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. గోదావరి జిల్లాల్లో ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఆయన గుర్తుచేశారు.
పొగాకు రైతుల సమస్యలపై ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించిందని మంత్రి తెలిపారు. లో-గ్రేడ్ పొగాకు కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం నుండి రూ. 94 కోట్లు విడుదల చేసి సపోర్ట్ ఇచ్చామని ఆయన వివరించారు. అలాగే ఎక్సెస్ క్రాప్‌పై ఎలాంటి అపరాధ రుసుము (పెనాల్టీ) విధించవద్దని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వ్యవసాయ మంత్రుల బృందం ఢిల్లీ వెళ్లి కేంద్రంతో సంప్రదింపులు జరిపిందని, త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయని చెప్పారు. నీటి కొరత ఉన్నందున రైతులు సాంప్రదాయ పంటలపైనే ఆధారపడకుండా, తక్కువ నీటితో ఎక్కువ రాబడినిచ్చే జొన్న, సజ్జ, మినుము, పెసర, కొర్రలు, రాగులు వంటి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని పిలుపునిచ్చారు.
రైతు సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ, కేంద్ర ప్రభుత్వం పిఎమ్ కిసాన్ కింద ఇచ్చే ₹6,000 కు తోడు, రాష్ట్ర ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ’ పథకం ద్వారా ₹14,000 కలిపి ఏటా ప్రతి రైతు కుటుంబానికి ₹20,000 ఆర్థిక సాయం అందిస్తోందని తెలిపారు. జిల్లాలో ఇ-పంట (e-Panta) నమోదు వేగవంతంగా జరుగుతోందని, అర్హులైన ప్రతి రైతుకూ నష్టపరిహారం మరియు ఇన్సూరెన్స్ వర్తింపజేస్తామని చెప్పారు. పశ్చిమ ప్రాంతాలకు నీటి వసతి కోసం వెలుగొండ ప్రాజెక్టు నీటిని గుండ్లకమ్మ మరియు పాలేరు రిజర్వాయర్లకు తరలించేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.
పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు మళ్లించి పంటలను కాపాడుకోగలిగామని మంత్రి గుర్తుచేశారు. అదే బాటలో ఉత్తరాంధ్ర, పశ్చిమ ప్రాంతాలకు నీటి వసతి కల్పిస్తున్నామని చెప్పారు. వెలుగొండ ప్రాజెక్టు నీటిని గుండ్లకమ్మ, పాలేరు రిజర్వాయర్లతో పాటు ముసి నదికి, నాగార్జున సాగర్ ఆయకట్టుకు కేటాయిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నామని, సెకండ్ ఫేజ్ పనుల ద్వారా పశ్చిమ ప్రాంతాలకు కూడా సాగునీటి కొరత తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
క్షేత్రస్థాయి అధికారులు, కృషి విజ్ఞాన కేంద్రం (KVK) శాస్త్రవేత్తలు నిరంతరం రైతులకు అందుబాటులో ఉండి కిసాన్ డ్రోన్లు, మట్టి పరీక్షలు మరియు ఆధునిక పరిజ్ఞానంపై తగిన సలహాలు అందించాలని మంత్రి ఆదేశించారు.
జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక మార్పులు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులందరూ ఒడిసిపట్టుకోవాలని, వాతావరణ మరియు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పంటల వైవిధ్యీకరణ (Crop Diversification) వైపు మొగ్గు చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి గారు పిలుపునిచ్చారు. ‘ఆత్మా’ (అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమం మరియు ‘కిసాన్ మేళా’లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ప్రసంగిస్తూ, ఈ కిసాన్ మేళా కేవలం ఒక శిక్షణా కార్యక్రమం మాత్రమే కాదని, వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు రైతుల మధ్య ఆలోచనలు, అనుభవాలను పంచుకునే ఒక ఉన్నతమైన ‘నాలెడ్జ్ ఎక్స్చేంజ్’ వేదిక అని కొనియాడారు. జిల్లాలోని 372 రైతు సేవా కేంద్రాలు (RSKలు), గ్రామ సచివాలయాల ద్వారా నిరంతరం సేవలు అందుతున్నప్పటికీ, ఇటువంటి కిసాన్ మేళాల ద్వారా రైతులు నేరుగా శాస్త్రవేత్తలతో మాట్లాడి తమ సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం లభిస్తుందన్నారు.
ప్రస్తుతం ఎల్ నినో ప్రభావంతో నీటి లభ్యత తగ్గడం, మార్కెట్‌లో ధరల అస్థిరత మరియు అంతర్జాతీయ మార్కెట్ ప్రభావాల వల్ల వ్యవసాయం సవాలుగా మారిందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రతికూల వాతావరణం, ప్రతి సంవత్సరం మారే పరిస్థితులను తట్టుకోవడానికి ఒకే రకమైన పరిష్కారం సరిపోదని, మండల మరియు గ్రామీణ స్థాయిలో రైతుల అవసరాలకు తగినట్లుగా విధానాలు మారాలని తెలిపారు. అందరూ ఒకే రకమైన పంటను సాగు చేయడం వల్ల మార్కెట్‌లో ధర పడిపోయి నష్టపోవాల్సి వస్తుందని, అందుకే రైతులు కొంత ఓర్పుతో పంటల వైవిధ్యీకరణను అలవర్చుకోవాలని సూచించారు.
ఈ సమస్యల పరిష్కారానికి వ్యవసాయ శాఖ ఒక్కటే కాకుండా హార్టికల్చర్, ఫిషరీస్, సెరికల్చర్ వంటి అన్ని అనుబంధ శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. జెడీ అగ్రికల్చర్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా క్లస్టర్లను ఏర్పాటు చేసి, అందులో శాస్త్రవేత్తలు, వివిధ శాఖల అధికారులు మరియు రైతు సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక కమిటీలు నియమించాలని చెప్పారు. మండల మరియు గ్రామ స్థాయిల్లో రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు, ప్రభుత్వ పథకాల సమాచారాన్ని అందించడానికి ప్రత్యేక సభలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. కృషి విజ్ఞాన కేంద్రాల (KVK) ద్వారా అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందిస్తూ, ప్రతికూల పరిస్థితుల్లోనూ రైతులకు జిల్లా యంత్రాంగం మరియు ప్రభుత్వం పూర్తి కొండంత అండగా ఉంటుందని జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి గారు భరోసా ఇచ్చారు.
జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ శ్రీమతి ముప్పవరపు సుచిత్ర
జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ శ్రీమతి ముప్పవరపు సుచిత్ర మాట్లాడుతూ రైతాంగానికి అనుకూలమైన సమాచారాన్ని, ప్రభుత్వ పథకాలను సరైన సమయంలో చేరవేసి, శాస్త్రీయ పద్ధతుల్లో వ్యవసాయాన్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ శ్రీమతి ముప్పవరపు సుచిత్ర ఆకాంక్షించారు.
ప్రస్తుతం ఎల్ నినో వంటి ప్రతికూల వాతావరణ ప్రభావాలు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం వర్షాల కోసం ఎదురుచూడటం మాత్రమే కాకుండా, వర్షాభావం లేదా వాతావరణ మార్పులు సంభవించినప్పుడు పంటలను ఎలా కాపాడుకోవాలనే దానిపై ముందస్తు ప్రణాళికలు అవసరమని గుర్తుచేశారు.
రైతు సుదీర్ఘ అనుభవం, శాస్త్రవేత్తల సాంకేతిక విజ్ఞానం, మరియు వ్యవసాయ అధికారుల సకాలపు సూచనలు
ఈ మూడూ సమన్వయంతో పనిచేసినప్పుడే వ్యవసాయంలో మెరుగైన ఫలితాలు సాధించడం సాధ్యమవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. రైతులకు ఏ పంట వేయాలి, నీటిని ఏ విధంగా పొదుపు చేయాలి, సాంకేతిక పద్ధతులను ఎలా పాటించాలి అనే విషయాలపై ముందస్తు సమాచారం కచ్చితంగా అందాలని స్పష్టం చేశారు.
అలాగే, వ్యవసాయ మరియు అనుబంధ శాఖలు అందిస్తున్న సేవలు, ప్రభుత్వ పథకాల గురించి ప్రతి రైతుకూ పూర్తి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పథకాలు అందుబాటులో ఉన్నాయని చెప్పడమే కాకుండా, అవి నిజంగా అర్హులైన ప్రతి రైతుకూ చేరుతున్నాయో లేదో చూడటమే అసలైన బాధ్యత అని పేర్కొన్నారు. రైతు సమస్యను మన సమస్యగా భావించి పరిష్కార దిశగా సాగాలని, రైతులను సమాచారంతోనూ, వ్యవసాయాన్ని శాస్త్రీయ పద్ధతులతోనూ బలోపేతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్.శ్రీనివాసరావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి గోపీచంద్,ఆత్మ పీడీ రత్న మంజుల , శాస్త్రవేత్తలు,అధికారులు పాల్గొన్నారు.






