అద్దంకి: 22ఏ నిషేధిత జాబితాలో భూములు ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం అద్దంకి ఆర్డీఓ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అద్దంకి నియోజకవర్గ పరిధిలోని భూ సమస్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల తహశీల్దార్లతో పాటు ఆర్డీఓతో భూ సమస్యలపై సమగ్రంగా చర్చించారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న భూ సమస్యలను ముందుగా గుర్తించి, వాటిలో అర్హులైన వారి సమస్యలను నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భూములకు సంబంధించి అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయని మంత్రి ఆరోపించారు. ఎలాంటి అవసరం లేని కొన్ని భూములను కూడా అప్పటి వైసీపీ నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం 22ఏ నిషేధిత జాబితాలో చేర్పించారనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ఇలాంటి చర్యల వల్ల సామాన్య ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. భూ సమస్యల పరిష్కారంలో అధికారులు పూర్తి పారదర్శకత పాటించాలని, అర్హులైన వారికి ఎలాంటి అన్యాయం జరగకుండా నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ప్రజలకు సంబంధించిన భూ సమస్యలను పెండింగ్లో ఉంచకుండా పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో ఆర్డీఓ, ఐదు మండలాల తహశీల్దార్లు పాల్గొన్నారు.
