న్యూఢిల్లీ, నవంబర్ 2, ( జె ఎస్ డి ఎం న్యూస్) :
మహిళా సాధికారత దిశగా తెలంగాణ మహిళా కమిషన్ చేస్తున్న కృషికి జాతీయ మహిళా కమిషన్ ప్రశంసలు తెలియజేశారు.
మహిళల హక్కుల పరిరక్షణ, భద్రత, సంక్షేమం,సమానత్వం, సాధికారతే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర మహిళా
కమిషన్
చేపడుతున్న కార్యక్రమాలను జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ కిషోర్ రాహట్కర్ అభినందించారు.
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద న్యూఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్ కార్యాలయంలో జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ కిషోర్ రాహట్కర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమాలు, మహిళల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ప్రత్యేక కార్యాచరణ, మహిళల హక్కుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు, కమిషన్ సాధించిన ప్రగతి, వివిధ సామాజిక సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషిని వివరిస్తూ ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకాన్ని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్కు అందజేశారు.ఈ పుస్తకంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చేపట్టిన కార్యక్రమాలు, మహిళలకు న్యాయం అందించేందుకు నిర్వహిస్తున్న విచారణలు, బాధిత మహిళలకు అండగా నిలుస్తున్న విధానాలు, మహిళా హక్కులపై అవగాహన కార్యక్రమాలు, మహిళల భద్రత, సామాజిక న్యాయం, ఆర్థిక స్వావలంబన, గ్రామీణ ప్రాంత మహిళల అభ్యున్నతికి చేపడుతున్న చర్యలను వివరించారు.తెలంగాణ మహిళా కమిషన్ రూపొందించిన కార్యక్రమాల సమగ్ర నివేదికను, పుస్తక రూపంలో వాటిని పొందుపరిచిన విధానాన్ని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ కిషోర్ రహత్కర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. రాష్ట్రస్థాయిలో మహిళల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం జరుగుతున్న కృషి పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఈ కార్యక్రమాలు మరింత విస్తృత స్థాయిలో కొనసాగాలని ఆకాంక్షించారు.



Save or share this story as a newspaper-style Epaper Clip: