ఒంగోలు: ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో అందిస్తున్న వైద్య సేవలు, పారిశుద్ధ్యం, ఇతర సదుపాయాలపై ప్రజల సంతృప్తి స్థాయి రాష్ట్ర సగటు ప్రమాణాలకు సమానంగా ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని డీఆర్వో, జీజీహెచ్ అడ్మినిస్ట్రేటర్ వెంకటరమణ సూచించారు. ప్రజల సంతృప్తి స్థాయిని అంచనా వేసే ఐవీఆర్ఎస్ (IVRS), పీపుల్స్ పర్సెప్షన్ అంశాలపై గురువారం జీజీహెచ్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ సమావేశంలో డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటేశ్వర్లు, ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ తిరుపతిరెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ కుమార్, ఏఆర్వోలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ ఆసుపత్రిలో అందించే అన్ని రకాల వైద్య సేవలతో పాటు పారిశుద్ధ్యం, రోగులకు కల్పిస్తున్న ఇతర సదుపాయాలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా రోగులు, వారి సహాయకుల నుంచి నేరుగా అభిప్రాయాలు సేకరించే వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని, వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా లోపాలను వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు.
పారిశుద్ధ్య నిర్వహణపై ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో సానుకూల స్పందన రావడం లేదని పేర్కొంటూ, ఈ విషయంలో ఇప్పటికే పారిశుద్ధ్య కాంట్రాక్టర్‌కు నోటీసు జారీ చేసినట్లు తెలిపారు. పనితీరులో మెరుగుదల లేకపోతే నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆసుపత్రిలో వైద్య సేవలు, పారిశుద్ధ్యం, రోగులకు అందించే ఇతర సౌకర్యాలపై ప్రజల సంతృప్తి పెంపొందించడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం సిబ్బంది ద్వారా రోగుల నుంచి నేరుగా అభిప్రాయాలు సేకరిస్తున్న విధానాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు.
సమావేశంలో ప్రజల సంతృప్తి స్థాయి పెంపునకు తీసుకోవాల్సిన పలు కార్యాచరణ చర్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటేశ్వర్లు, ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ తిరుపతిరెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ కుమార్, ఏఆర్వోలు సునీల్ కుమార్, బ్రహ్మతేజ, లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: