డ్రక్స్ రహిత, మహిళలకు భద్రమైన, సురక్షిత రోడ్డు ప్రయాణ ప్రకాశం జిల్లా ఆవిష్కరణకు సంబంధిత శాఖలు చేపట్టిన చర్యలను మరింత విస్తృతం చేయాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు పిలుపునిచ్చారు. శనివారం ప్రకాశం భవనంలో ఆయన అధ్యక్షతన జిల్లాస్థాయి మాదకద్రవ్య నివారణ, రోడ్డు భద్రత, మైనింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజుతో కలిసి ఆయా అంశాలలో జిల్లా సాధించిన పురోగతిపై సమీక్షించారు. గత సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలుకు సంబంధించిన నివేదికలను ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆయేషా బేగం, డిటిసి సుశీల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పోలీసు శాఖ ద్వారా అమలు చేస్తున్న ‘ త్రిశూల్ ‘ కార్యక్రమాలను ఎస్పీ పి.రాజాబాబు వివరించారు. గత ఏడాది మొదటి 10 నెలలతో పోల్చితే ఈ ఏడాది ఇప్పటివరకు మహిళ పట్ల నేరాలు 14 శాతం, రోడ్డు ప్రమాదాలు 18 శాతం తగ్గాయని ఎస్పీ చెప్పారు. ఇప్పటివరకు 320 కిలోల గంజాయిని సీజ్ చేశామన్నారు.
దీనిపై కలెక్టర్ స్పందిస్తూ సమన్వయంతో మరింత పురోగతి సాధించేలా సంబంధిత శాఖలు పనిచేయాలని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రోడ్డు నిర్మాణాలకు అవరోధంగా ఉన్న రెవెన్యూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. రహదారి భద్రత కోసం అవసరమైన సామగ్రిని చేపట్టేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తే డిఎంఎఫ్ నిధులను ఇస్తామని చెప్పారు. రహదారి ప్రమాదాలు నివారించేందుకు విద్యార్థులకు, ప్రజలకు, ప్రభుత్వ డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన దిశా నిర్దేశం చేశారు. అవసరమైన మార్గాలలో స్పీడు బ్రేకర్లు, రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయాలన్నారు. అక్రమ మైనింగ్ పై ఉక్కు పాదం మోపాలని అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు. సంబంధిత శాఖలు సంయుక్తంగా తనిఖీలు చేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను 15 రోజుల్లోగా సిద్ధం చేయాలని మైనింగ్ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ పి. వెంకటరమణ, డీఎంహెచ్వో వెంకటేశ్వర్లు, ఆర్డిఓ చంద్రశేఖర్ నాయుడు, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ అనిల్ కుమార్, రోడ్లు భవనాల శాఖ ఈ.ఈ. గోపి నాయక్, గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ బి.రామచంద్ర, ఆర్టీసీ ఆర్ఎం సత్యనారాయణ, డీఈవో రంగయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.



Save or share this story as a newspaper-style Epaper Clip: