కందుకూరు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజుతో కలిసి శనివారం ఆయన పట్టణంలో పర్యటించారు. స్ట్రాంగ్ రూము, కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తున్న పాలిటెక్నిక్ కాలేజీతో పాటు పోలింగ్ కేంద్రాలైన టీ.ఆర్.ఆర్. జూనియర్ కాలేజీ, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను వీరు సందర్శించారు. ఆయా కేంద్రాల్లో చేస్తున్న ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీలో 40 వార్డులకుగాను 65 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 26వ తేదీన ఎన్నికలు జరుగుతాయని, వీటికి సంబంధించిన ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా ఎన్నికల సంఘం నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు అవసరమైన మౌలిక వసతులు, క్యూలైన్లు, వృద్ధులు, బాలింతల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ సజావుగా, నిష్పక్షపాతంగా సాగేలా అవసరమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాలు, సీసీటీవీలతో ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. ఓటర్లందరూ స్వేచ్ఛగా తమ హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్, ఎస్పీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ పర్యటనలో వీరి వెంట సబ్ కలెక్టర్ డి. హిమవంశీ, డి.ఎస్.పి. బాలసుబ్రమణ్యం, మున్సిపల్ కమిషనర్ అనూష, తహసిల్దార్ మురళి, ఇతర అధికారులు ఉన్నారు.



Save or share this story as a newspaper-style Epaper Clip: