పంచాయతీ ఎన్నికలకు పగడ్బందీ ఏర్పాట్లు*. నేడు రెండో విడత ఎన్నికలు. 123 పంచాయతీలకు పోలింగ్*. క్షేత్రస్థాయి పరిస్థితిని పరిశీలించిన కలెక్టర్ రాజాబాబు*. పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశామన్న ఎస్పీ హర్షవర్ధన్ రాజు

అద్దంకి : రెండో విడత పంచాయతీ ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. ఆదివారం రెండో విడత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీటికి సంబంధించిన ఏర్పాట్లను ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజుతో కలిసి శనివారం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. అనంతరం వీటికి సంబంధించిన వివరాలను అద్దంకి ఆర్డిఓ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వీరు వివరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

మొత్తం వీడియో రికార్డింగ్

            జిల్లాలో రెండో విడతలో భాగంగా అద్దంకి, దర్శి నియోజకవర్గాలలో 123 పంచాయతీలకు, 1020 వార్డులకు పోలింగ్ నిర్వహించపోతున్నట్లు కలెక్టర్ చెప్పారు. పోలింగ్ విధులలో పాల్గొంటున్న సిబ్బందికి ఇప్పటికే అవసరమైన శిక్షణ ఇచ్చామన్నారు. ఎస్పీతో కలిసి బల్లికురవ, సంతమాగులూరు, కురిచేడు, దొనకొండ మండలాలలో పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాలను పరిశీలించినట్లు తెలిపారు. పోలింగ్ మరియు కౌంటింగ్ మొత్తం వీడియో రికార్డింగ్ చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో సీసీటీవీల ద్వారా ప్రత్యక్ష వీక్షణ చేస్తామన్నారు. సాధారణ పోలింగ్ కేంద్రాలలో వీడియోగ్రాఫర్ల ద్వారా మొత్తం ప్రక్రియను రికార్డు చేయిస్తున్నట్లు వివరించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ ఉంటుందని, అనంతరం ఓట్ల లెక్కింపు చేపడతామని చెప్పారు. ఫలితాలను కూడా అప్పటికప్పుడే ప్రకటించి ఆ వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్ సైట్ లో నమోదు చేస్తామని తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియలో ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించకుండా పనిచేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

బందోబస్తు ఇలా

             ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా భద్రతాపరంగా చేపట్టిన చర్యలను ఎస్పీ వివరించారు. ఈ ఎన్నికలలో 66 అత్యంత సమస్యాత్మక, 71 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామన్నారు. మొత్తంగా 1623 మంది పోలీసు సిబ్బందిని ఈ ఎన్నికలలో భద్రత విధుల కోసం మోహరించామన్నారు. ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి విఘాతం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కలెక్టర్, ఎస్పీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
               ఈ సమావేశంలో ఆర్డిఓ చంద్రశేఖర నాయుడు, తహసిల్దార్ చరణ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *