ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని కచ్చితంగా పరిష్కరించాలి – జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ కె.శ్రీనివాసులు

ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని కచ్చితంగా పరిష్కరించాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ కె.శ్రీనివాసులు అధికారులకు స్పష్టం చేశారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని స్పందన హాలులో
“డయల్ యువర్ కలెక్టర్ ”, “స్పందన” కార్యక్రమాలలో ప్రజల నుంచి ఆయన ఫిర్యాదులు,విజ్ఞప్తులను స్వీకరించారు.
ఈ సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్ మాట్లాడుతూ…. స్పందన అర్జీలను పరిష్కరించడంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. అర్జీల పరిష్కారంలో సహేతుకత ముఖ్యమని ఆయన అన్నారు. పిటిషన్లు రీఓపెన్ కాకుండా చూడాలని చెప్పారు. సమస్యను పరిష్కరించలేని పక్షంలో అందుకు గల కారణాలను అర్జీదారులకు వివరించాలన్నారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముందుగా డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ కె.శ్రీనివాసులు ప్రజలు ఫోన్లో ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా, మండల స్థాయి అధికారులను ఆదేశించారు. వీటిపై అప్పటికప్పుడే సంబంధిత అధికారులతో ఆయన మాట్లాడారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
  • తర్లుపాడు మండలం పూతలపాడు గ్రామం నుంచి ఆర్. పెదకాశయ్య ఫోన్ చేశారు. జలకళ పధకం క్రింద బోరు వేశారని, కానీ సంబంధిత మెటీరియల్ ఇవ్వలేదని ఇన్ఛార్జి కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఆయన స్పందిస్తూ వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆర్.డబ్ల్యు.ఎస్. అధికారులను ఆదేశించారు.
  • కురిచేడు మండలం పెద్దవరం గ్రామం నుంచి జి. గురుస్వామి ఫోన్ చేశారు. సర్వే నెంబరు 268-3 లోని తమ భూమికి జాయింట్ పట్టా కలిగి ఉన్నామని, సబ్ డివిజన్ చేయాలని ఇన్ఛార్జి కలెక్టర్ ను కోరారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కురిచేడు మండల తహశీల్దార్ ను ఆయన ఆదేశించారు.
  • ఒంగోలు మండలం ఒంగోలు నుంచి సంపూర్ణ ఫోన్ చేశారు. సర్వే నెం.222,223 లో ఉన్న భూమి కోర్టు కేసులో ఉన్నందున ఈ సర్వే నెంబరుపై ఎటువంటి లావాదేవీలు జరగకుండా చూడాలని ఇన్ఛార్జి కలెక్టరును కోరారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి సమస్యను పరిష్కరించాలని ఒంగోలు మండల తహశీల్దార్ ను ఆయన ఆదేశించారు.
    కార్యక్రమంలో డి.ఆర్.ఓ. ఆర్.శ్రీలత, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఉమాదేవి, చెన్నయ్య, మాధురి, తదితరు అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *