మాదక ద్రవ్యాల సాగు, రవాణా, వినియోగాన్ని నివారించడానికి సంబంధిత శాఖలు మరింత సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ కె. శ్రీనివాసులు స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల నివారణపై జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశము మంగళవారం ఆయన అధ్యక్షతన కలెక్టరేట్ లో జరిగింది.
జిల్లాలో మాదక ద్రవ్యాల సాగు, రవాణా, వినియోగం, వీటివలన చట్టపరంగా, ఆరోగ్య పరంగా ఎదురయ్యే ఇబ్బందులపై కల్పిస్తున్న అవగాహనా కార్యక్రమాల గురించి ఈ సందర్భంగా ఆయన సమీక్షించారు. మాదక ద్రవ్యాలను సాగు స్థాయిలోనే కట్టడి చేసేలా ఈ-క్రాప్ బుకింగ్ సమయంలో వ్యవసాయ అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆయన ఆదేశించారు. వీటి రవాణా జరుగకుండా చెకోపోస్ట్ వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో రవాణా మరియు మార్కెటింగ్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ట్రెమడాల్ డ్రగ్స్ ను ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మందుల షాపులలో విక్రయించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. డ్రగ్స్ వినియోగం వలన సామాజికంగా, చట్టపరంగా ఎదురయ్యే ఇబ్బందుల గురించి వలస కార్మికులు ఉంటున్న ప్రదేశాలలోనూ, కాలేజీలలోనూ ప్రత్యేక అవగాహనా కార్యక్రమాలు రెగ్యులర్ గా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. విద్య, అటవీ, పోలీసు, సెబ్ అధికారులు సమన్వయంతో ఈ దిశగా చర్యలు తీసుకోవాలని వారికి ఆదేశాలు జారీ చేశారు. హాస్టళ్లలోని విద్యార్ధుల ప్రవర్తనను కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని ఆయన చెప్పారు.
సమావేశంలో ఏ.ఎస్.పి. నాగేశ్వరరావు, ఒంగోలు ఆర్.డి.ఓ. విశ్వేశ్వరరావు, కనిగిరి ఆర్.డి.ఓ. అజయ్ కుమార్, ఆర్.ఐ.ఓ. సైమన్ విక్టర్, ఒంగోలు జి.జి. హెచ్ సూపరింటెండెంట్ భగవాన్ నాయక్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్, ఎఫ్.ఆర్.ఓ. ఏ.వి. నాగేంద్రరావు, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. శ్రీనివాసరావు, డ్రగ్స్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ వి.ఎస్.జ్యోతి, రిమ్స్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సి. హెచ్. సుధాకర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె. రామచంద్రరావు, మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు ఉపేంద్ర, జి.జి.హెచ్. మానసిక వైద్య విభాగ అధిపతి డాక్టర్ ఐ. లక్ష్మీ నారాయణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


