విజ్ఞానం, నైతిక విలువలతో కూడిన భావి భారత నిర్మాణంలో గురువులదే కీలకపాత్ర అని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.
భారత మాజీ రాష్ట్రపతి స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం కలెక్టరేట్ లోని స్పందన హాలులో జిల్లా విద్యాధికారి శ్రీ వి.ఎస్. సుబ్బారావు అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి గురుపూజోత్సవంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఇన్ఛార్జ్ కలెక్టర్ కె.శ్రీనివాసులు, జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎం.ఎల్.సి. పోతుల సునీత, ఎం.ఎల్.ఏ.లు అన్నా రాంబాబు, కె.నాగార్జున రెడ్డి, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, సి.డి.పి.సి. బ్యాంకు చైర్మన్ వై.ఎం.ప్రసాదరెడ్డితో కలిసి ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
అనంతరం మంత్రి సురేష్ మాట్లాడుతూ… విద్యాభ్యాసంతోనే సామాజికంగా, ఆర్థికంగా ముందడుగు వేయడం సాధ్యమౌతుందన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆలోచనకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ఈ నాలుగేళ్ల కాలంలో రూ.60 వేల కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయడమే దీనికి నిదర్శనమన్నారు. మారుతున్న పరిస్థితులకు తగినట్లుగా విద్యారంగ బోధనలో సాంకేతిక విధానాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశ పెట్టడం. సబ్జెక్ట్ టీచర్ల నియామకం, ద్విభాషా (తెలుగు- ఇంగ్లీష్ పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు సరఫరా చేయడం, హైస్కూల్ విద్యార్ధులకు ట్యాబ్లు పంపిణీ చేయడం, బైజూస్ పాఠ్యాంశాలను విద్యార్థులకు అందుబాటులోకి తేవడం వంటి విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చామని మంత్రి వివరించారు. నాణ్యమైన విద్యను అందించడంతోపాటు పిల్లలు ఆరోగ్యంగా ఉండేలా పోషకాలతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని పెడుతున్నట్లు చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులపై భారం పడకుండా అమ్మఒడి, విద్యా కానుక, ఉన్నత స్థాయిలో విద్యా దీవెన, వసతి దీవెన వంటి పధకాలను ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టి పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మెరుగైన ప్రాథమిక విద్య అందించడంతోపాటు ప్రతి మండలానికి రెండు జూనియర్ కాలేజీలు ఉండాలన్నది ముఖ్యమంత్రి ఆలోచనగా ఆయన పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో కొత్తగా మెడికల్ కాలేజీలను కూడా అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి సురేష్ చెప్పారు. విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం చూస్తుంటే అవకాశం లభిస్తే ఉపాధ్యాయునిగా వెళ్లాలనే ఆశ తనకు కలుగుతున్నట్లు
వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా పని చేయాలని, సర్వేపల్లి. రాధాకృష్ణన్ స్ఫూర్తితో మెరుగైన సమాజాన్ని రూపొందించడానికి పునరంకితం కావాలని ఉపాధ్యాయులకు ఆయన పిలుపునిచ్చారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో “ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ” ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి అన్నారు.
జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ… కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా నాడు – నేడు పనులకు ప్రాధాన్యం ఇచ్చి పాఠశాలల్లో అత్యాధునిక మౌలిక సదుపాయాలు కల్పించిందని గుర్తు చేశారు. పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్యను పెంచడానికిఅనేక పథకాలను అమలు చేయడం గొప్ప విషయమని అన్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ… చదువుతోపాటు విద్యార్థులకు మంచి నడవడికను నేర్పే గురువులే వారికి ప్రత్యక్ష దైవం అని వ్యాఖ్యానించారు. విద్యార్థులను ఉత్తము పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో వారిని సున్నితంగా మందలించడంలో తప్పు లేదు కానీ, వారిని ఆత్మన్యూనతా భావంలోకి తీసుకువెళ్లేలా ఉపాధ్యాయులు వ్యవహరించకూడదని ఆమె సూచించారు. జడ్పీ చైర్పర్సన్ గా పాఠశాలలను తనిఖీ చేస్తున్నప్పుడు గుర్తించిన సమస్యలను పరిష్కరిస్తున్నట్లు చెప్పారు.
ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తికీ విద్యే విలువైన ఆస్తి అని అన్నారు. విద్యార్థులందరినీ ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నట్లు చెప్పారు. ఈ దిశగా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడంలో గురువుల పాత్ర ఎంతో విలువైనదని కొనియాడారు.
ఎం.ఎల్.ఏ. అన్నా రాంబాబు మాట్లాడుతూ… విద్యతోపాటు విలువలతో కూడిన జీవితంఎంతో ముఖ్యమని అన్నారు. గురువుల బోధన ద్వారానే ఉన్నత వ్యక్తిత్వం సాధ్యమవుతుందనిస్పష్టం చేశారు. తరాలు మారినా విలువ తగ్గనిది ఉపాధ్యాయ వృత్తి మాత్రమేనని ఆయనవ్యాఖ్యానించారు.
ఎం.ఎల్.ఏ. కె.నాగార్జున రెడ్డి మాట్లాడుతూ …విద్య, వైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో వెనుకబడిన పశ్చిమ ప్రాంతంలోని ఒక్క మార్కాపురంలోనే దాదాపు రూ.4 కోట్లతో వాడు- నేడు పనులు చేపట్టినట్లు తెలిపారు. మార్కాపురానికి మెడికల్ కాలేజీని కూడా కేటాయించడం ద్వారా మరింత మంది విద్యార్థులకు వైద్య విద్యను అభ్యపించే అవకాశం లభిస్తున్నట్లు చెప్పారు.
ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ… వివిధ రంగాలలో గురువులు ఉన్నా బాల్యంలో మనకు విద్యాబుద్ధులు నేర్పే గురువులకు మనం ఇచ్చే గుర్తింపు ఎంతో గొప్పదన్నారు. తల్లి జన్మనిస్తే, గురువు జ్ఞానాన్ని ఇస్తారని అన్నారు. నిరంతరం జ్ఞాన దీపాలుగా ఉంటూ మరో పది మందికి వెలుగులు పంచడం గురువులకే సాధ్యమని ఆమె కొనియాడారు.
ఈ సందర్భంగా ఈ ఏడాది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 53 మంది ఉపాధ్యాయులను సన్మానించారు.
కార్యక్రమంలోఎస్.సి, కార్పొరేషన్ డైరెక్టర్ ఎల్.రవిలాలు, మైనార్టీస్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్.కె. మహబూబ్, సూర్య బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ డి. కరుణాకర్, శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ చెన్నకేశవ, ఇతర ప్రజాప్రతినిధులు, ఆర్.ఐ.ఓ. సైమన్ విక్టర్, ఏ.ఎల్.ఎస్. కో-ఆర్డినేటర్ రాణి, తదితరులు డీఈవో వి.సుబ్బారావు, పి.ఈ.ఓ. సామా సుబ్బారావు, డిప్యూటీ డి.ఈ.ఓ. అనితా రోజ్ పాల్గొన్నారు.








