ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఏ.ఎస్.దినేష్ కుమార్ స్పష్టం చేశారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని స్పందన హాలులో “స్పందన ” కార్యక్రమంలో ప్రజల నుంచి ఆయన ఫిర్యాదులు, విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో 136 అర్జీలు వచ్చాయి.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… స్పందన కార్యక్రమంలో వచ్చిన ప్రతి అర్జీని కచ్చితంగా పరిష్కరించాలన్నారు. అర్జీల పరిష్కారంలో సహేతుకత ముఖ్యమని చెప్పారు. పిటిషన్లు రీఓపెన్ కాకుండా చూడాలని ఆయన అన్నారు. ప్రజలు సంతృప్తి చెందేలా అర్జీ లను పరిష్కరించాలని ఆయన స్పష్టం చేశారు. సమస్యను పరిష్కరించలేని పక్షంలో అందుకు గల కారణాలను అర్జీదారులకు వివరించాలన్నారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె. శ్రీనివాసులు, డి.ఆర్.ఓ. ఆర్.శ్రీలత, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.


