సకల సౌకర్యాలతో ఏర్పాటు చేసిన లేఅవుట్లలో వేల మంది పేదలకు సొంతింటి కల సాకారం కావడం చరిత్రాత్మకమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు మేరుగు నాగార్జున అన్నారు.
నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా జగనన్న కాలనీలలో పట్టాలు పొంది, నిర్మాణం పూర్తయిన 7.43 లక్షల ఇళ్లకు గృహప్రవేశ రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని కాకినాడ జిల్లా సామర్లకోటలో ముఖ్యమంత్రి వై. జగన్ మోహన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. దీనికి అనుబంధంగా ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం కె.వి.పాలెం లేఅవుట్లో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమంలో మంత్రి నాగార్జున తోపాటు రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, జడ్పీ ఛైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు ఎం.పి. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నిర్మించిన శిలా ఫలకాన్ని, జగనన్న కాలనీ ప్రవేశ ద్వారాన్ని (ఆర్చ్) అతిధులు ఆవిష్కరించారు. అనంతరం పూర్తయిన ఇళ్లలోకి రిబ్బన్ కట్ చేసి లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి నాగార్జున మాట్లాడుతూ… రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందేలా ముందు చూపుతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని అన్నారు. చదువు, ఆరోగ్యంతోపాటు పేదలకు స్థిరాస్తి రూపంలో పక్కా ఇళ్లు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఎలాంటి అవినీతి లేకుండా పారదర్శకంగా పరిపాలన అందిస్తూ నవసమాజానికి ముఖ్యమంత్రి నాంది పలికారని ఆయన అన్నారు. నాలుగున్నరేళ్ల కాలంలో ఈ దిశగా పరిపాలన సాగుతుండడంతో నేడు దేశం మొత్తం ఏ.పి. వైపు చూస్తోందని పేర్కొన్నారు.
మంత్రి సురేష్ మాట్లాడుతూ… దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ కనీవినీ ఎరుగని రీతిలో లక్షల సంఖ్యలో పేదలకు సొంతింటి కలను ముఖ్యమంత్రి సాకారం చేశారని అన్నారు. మార్కెట్ ధర కన్నా తక్కువ ధరకు ముడి సరుకు సరఫరా చేయడంతోపాటు ఇళ్ల నిర్మాణంలోనూ లబ్ధిదారుల స్తోమత, అభీష్టం మేరకు వివిధ ఆప్షన్లను వారికి ఇచ్చామన్నారు. అక్కా చెల్లెమ్మలపై ప్రేమతోనే ముఖ్యమంత్రి ఇవన్నీ చేస్తున్నారని మంత్రి చెప్పారు. కరోనా వంటి
క్లిష్ట ఆర్థిక పరిస్థితులలోనూ పేదలకు లబ్ధికలిగించే పథకాలను ముఖ్యమంత్రి కొనసాగించారని ఆయన వివరించారు. చీమకుర్తి నగర పంచాయతీలో మురుగు కాల్వల నిర్మాణానికి రూ.2 కోట్లను మంజూరు చేస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.
ఎం.పి. మాగుంట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… పక్కా ఇంటితో పాటు పేదల మౌలిక అవసరాలు తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. పండుగ వాతావరణంలో లక్షల సంఖ్యలో ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా గృహ ప్రవేశ కార్యక్రమాలు చేపట్టడం సంతోషదాయకమన్నారు. అన్ని వర్గాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆయన అన్నారు.
జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ.. జగనన్న లేఅవుట్ల ద్వారా కొత్త ఊళ్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిందని కొనియాడారు. సొంత ఇల్లు ఉండడం ఆత్మ గౌరవానికి ప్రతీక అని ఆమె అన్నారు. అందుకే మహిళల పేరుతో ఇల్లు నిర్మించడంతోపాటు సంక్షేమ పధకాలలో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు.
కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ… అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయడం వల్లే ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తవుతున్నట్లు చెప్పారు. జిల్లాలో 8 నియోజకవర్గాలలో కలిపి మొత్తం రూ.1331.87 కోట్ల విలువైన 73,993 ఇళ్లను కేటాయించగా ఇప్పటి వరకు 18,278 ఇళ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. చీమకుర్తి నగర పంచాయతీలో నాలుగు ప్రాంతాలలో మొత్తం 8 లేఅవుట్లలో 1531 ఇళ్లను మంజూరు చేయగా అందులో 600 ఇళ్ల నిర్మాణం పూర్తయినట్లు వివరించారు. కె.వి.పాలెంలో 10.66 ఎకరాలలో 575 ఇళ్లను మంజూరు చేయగా 281 ఇళ్ల నిర్మాణం పూర్తయినట్లు చెప్పారు. ఇక్కడి లబ్ధిదారులకు రూ.6.37 కోట్లను విడుదల చేశామన్నారు. ఈ లే అవుట్ లో సైడ్ డ్రైన్స్ కోసం రూ.16.86 లక్షలను కేటాయిస్తున్నట్లు చెప్పారు. జగనన్న కాలనీలలో ఇంకుడు గుంతలు తవ్వుకోవడానికి ప్రతి ఇంటికీ ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, కానీ కె.వి. పాలెంలోని లబ్ధిదారుల కోరిక మేరకు ఇంకుడు గుంతలు కాకుండా సైడ్ డ్రైన్స్ నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. జగనన్న కాలనీలలో రాష్ట్రంలోనే తొలిసారిగా కె.వి. పాలెం లేఅవుట్లో ఈ విధంగా సైడ్ డ్రైన్స్ నిర్మించబోతున్నట్లు చెప్పారు. అదే విధంగా రూ.14.85 లక్షలతో అంతర్గత రోడ్లను కూడా నిర్మిస్తామన్నారు.
ఎం.ఎల్.ఏ. టి.జె.ఆర్. సుధాకర్ బాబు మాట్లడుతూ..
తన నియోజకవర్గంలో 6209 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. వీటిలో 3182 ఇళ్లు పూర్తయ్యాయని చెప్పారు. సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయడం వలనే ఈ నిర్మాణం పూర్తయినట్లు తెలిపారు. కె.వి.పాలెం లే అవుట్లో భూసేకరణ మొదలుకొని అందులో మౌలిక వసతుల కల్పనకు మొత్తం రూ.5.6 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసినట్లు వివరించారు. ఇంటి స్థలము, నిర్మాణ వ్యయంతో కలిపి ఒక్కో ఇంటి విలువ కనీసం రూ.6 లక్షలు ఉంటుందని చెప్పారు. మిగతా ఇళ్లను కూడా త్వరగా పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు ఆయన సూచించారు. ప్రభుత్వం నుంచి అవసరమైన ఆర్థిక సహాయం త్వరగా వచ్చేలా తాము చూస్తామన్నారు.
దర్శి మాజీ ఎం.ఎల్.ఏ. డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ….గతంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా లక్షల సంఖ్యలో ఇళ్లను కేటాయించడంతోపాటు వాటి నిర్మాణం పూర్తయ్యేలా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నిరంతరం పర్యవేక్షించారని అన్నారు. సొంత ఇల్లు కట్టించడం ద్వారా లబ్ధిదారులను లక్షల రూపాయల విలువైన స్థిరాస్తికి యజమానులుగా చేశారని ఆయన వివరించారు.
కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ విజయ్ కుమార్, హౌసింగ్ పి.డి. పేరయ్య, ఆర్.డబ్ల్యు.ఎస్. ఎస్. ఈ మర్దన్ అలీ, డి.ఆర్.డి.ఏ. పి.డి. రవికుమార్, పబ్లిక్ హెల్త్ ఈ.ఈ. అలీ, జడ్పీ.టి.సి. వేమా శ్రీనివాసరావు, ఏ.ఎం.సి. చైర్మన్ బంగారు బాబు, ఎం.పి.పి. వై.శ్రీనివాసరావు, మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్పర్సన్ బి. వెంకట రెడ్డి, ఎం.పి.డి.ఓ. రాఘవేంద్రరావు, తహశీల్దార్ మధుసూదన్ రావు, కమిషనర్ షేక్ ఫజులుల్లా, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
30 ఏళ్ల నిరీక్షణకు తెర ..!
నా పేరు ఈశ్వరమ్మ. నా భర్త క్వారీలో పనులకు వెళ్తుంటారు. 30 ఏళ్ల నుంచి అద్దె ఇంట్లో ఉంటున్నాము. రెక్కాడితే గానీ డొక్కాడని మాకు ఇంటి అద్దె కట్టుకోవడం కష్టంగా ఉండేది. జగనన్న కాలనీలో ప్రభుత్వం మాకు ఇంటి స్థలం ఇచ్చి, ఇళ్లు నిర్మించుకునేలా సహాయం చేసింది. సొంత ఇంట్లో ఉండాలన్న మా కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు.



