అనకాపల్లి జిల్లా రోలుగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయినిగా పని చేస్తున్న పి.వి.ఎం.నాగజ్యోతి ఈ నెల 5 నుంచి 9 వరకు నేపాల్ లో జరిగిన అంతర్జాతీయ సంయుక్త భారతీయ ఖేల్ ఫౌండేషన్ పోటీల్లో నాలుగు పతకాలు సాధించి సత్తా చాటారు. నాగజ్యోతి పవర్ లిఫ్టింగ్, 100 మీ. రన్నింగ్ పోటీల్లో బంగారు పతకాలు, డిస్కస్ త్రో, జావలిన్ త్రో పోటీల్లో రజత పతకాలు కైవశం చేసుకున్నారు. ఈ సందర్భంగా నాగజ్యోతిని మంగళవారం సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ అభినందించారు. ఖండంతారాల్లో కూడా క్రీడల్లో సత్తా చూపి మన విద్యాశాఖ, రాష్ట్ర, దేశ ఖ్యాతిని ఇనుమడింపజేయాలన్నారు. నాగజ్యోతిని స్ఫూర్తిగా తీసుకుని ఉపాధ్యాయులు క్రీడల్లో ప్రతిభ కనబరచాలని, విద్యార్థులను జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్య డైరెక్టర్ శ్రీమతి పి.పార్వతి , ఏపీ టెట్ జాయింట్ డైరెక్టర్ డా. మేరీ చంద్రిక , స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ జి.భానుమూర్తిరాజు తదితరులు పాల్గొన్నారు.
