కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మహిళల ఆరోగ్య ప్రయోజనం కొరకు ప్రారంభించిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా దేశవ్యాప్తంగా 75 లక్షల కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ స్టౌవ్, సిలిండర్, కనెక్షన్ ఇవ్వాలని నిర్ణయించి 1650 కోట్ల రూపాయలను విడుదలచేసింది. ఈ పథకంలో భాగంగా ప్రకాశం జిల్లాలో పదివేల కనెక్షన్లు ఇవ్వడానికి మంజూరు చేశారు. ఒంగోలు నగరంలో గ్యాస్ ఏజెన్సీలు మహిళల లబ్ధిదారులకు కనెక్షన్లు ఇవ్వడం ప్రారంభించారు.
భారతీయ జనతా పార్టీ మీడియా ఇంఛార్జ్ ధనిశెట్టి రామునాయుడు స్థానిక 27వ డివిజన్ సీతారాంపురంలోని తెనాలి కరుణ కు ఉజ్వలయోజన గురించి తెలిపి పలు గుర్తింపు కార్డులతో పథకంలో స్థానిక గ్యాస్ ఏజెన్సీలో పేరు నమోదు చేయించారు. గ్యాస్ ఏజెన్సీ వారు బుధవారం కరుణ ఇంటికి వద్దకు గ్యాస్ కనెక్షన్ తీసుకువచ్చి అందించారు. ఈ సందర్భంగా దానిశెట్టి మాట్లాడుతూ ఉజ్వల యోజన పథకాన్ని ప్రధాని మోదీ మహిళల ఆరోగ్య ప్రయోజనం కోసం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారని, ఈ పథకం పై ప్రజలకు అవగాహన కల్పించేలా పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, గ్యాస్ ఏజెన్సీలకు, స్థానిక సచివాలయ సిబ్బందికి ఉందని తెలిపారు. ఎందరో పాత పద్ధతిలోనే కట్టెలతో, బొగ్గుతో లేక కిరోసిన్ పొయ్యిల మీద వంట వండుకుంటున్నారని, దాని ద్వారా అనారోగ్యం పాలవుతున్నారని గమనించిన ప్రధాని ఉజ్వల పథకాన్ని ప్రవేశపెట్టి ఉచితంగా గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా ఈ ఉజ్వల యోజన ద్వారా కనెక్షన్ పొందిన వారికి సిలిండర్ పై 300 రూపాయలు దాకా సబ్సిడీ కూడా వస్తుందని కనుక గ్యాస్ స్టౌ లేని కుటుంబాల వారు తెలుపు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో స్థానిక గ్యాస్ ఏజెన్సీలను కలిసి పేరు నమోదు చేయించుకోవాల్సిందిగా గ్యాస్ సిలిండర్ పొందవలసిందిగా కోరారు.
ఈ కార్యక్రమం లో గ్యాస్ ఏజెన్సీ డెలివరీ బాయ్ అంజినీయులు,దనిశెట్టి రామునాయుడు, ఇందుర్తి పద్మావతి,తెనాలి కరుణ మరియు స్థానిక మహిళలు పాల్గొన్నారు.

