ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కృషి చేస్తున్నట్లు మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం ఆయన బన్సీలాల్ పేట లో అధికారులతో కలిసి BJR నగర్, MCH క్వార్టర్స్, D క్లాస్, అరుణ్ జ్యోతి కాలనీ తదితర ప్రాంతాలలో పర్యటించారు. ముందుగా BJR నగర్ లో గల డాక్టర్ BR. అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ ల విగ్రహాలకు నివాళులు అర్పించారు. అనంతరం స్థానికంగా 6 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీవరేజ్ పైప్ లైన్, 4.50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న మరో సీవరేజ్ పైప్ లైన్ పనులను ఆయన ప్రారంభించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుండి MCH క్వార్టర్స్ కు చేరుకొని నూతన సంవత్సరం సందర్భంగా స్థానికులు ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేశారు. అనంతరం స్థానిక ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమ బస్తీలోని శిధిలావస్థలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని తొలగించాలని కోరగా, వెంటనే స్తంభాన్ని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న విద్యుత్ అధికారులను ఆదేశించారు. రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరగా, డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తయ్యాయని, త్వరలోనే రోడ్డు నిర్మాణ పనులు కూడా చేపట్టనున్నట్లు వివరించారు. వివేకానంద నగర్ లోని ఖాళీ స్థలంలో పార్క్ ను నిర్మించాలని స్థానికులు కోరగా, నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. D క్లాస్ లో గల ఖాళీ స్థలంలో రాత్రివేళల్లో పోకిరీలు తిష్టవేసి మద్యం సేవిస్తూ స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని స్థానికులు MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఆయన ఈ ఖాళీ స్థలంలో స్థానిక ప్రజల సౌకర్యార్ధం కమ్యునిటీ హాల్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందుకు గాను ఇప్పటికే నిధులు కూడా మంజూరైనాయని అన్నారు. వెంటనే కమ్యునిటీ హాల్ నిర్మాణ పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా D క్లాస్ లోనే వాటర్ పైప్ లైన్ పనులు పూర్తయ్యాయని, రోడ్డు నిర్మాణ పనులు కూడా త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరగా, వెంటనే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అరుణ్ జ్యోతి కాలనీలో చేపట్టిన రోడ్డు పనులను పరిశీలించిన ఆయన పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. నియోజకవర్గ పరిధిలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి వారి ఇబ్బందులను దూరం చేయాలనే లక్ష్యంతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని తెలిపారు. వాటిలో కొన్ని ఎన్నికల ముందు పూర్తి కాగా, మరికొన్ని పనులు ఎన్నికల కోడ్ రావడంతో మధ్యలోనే నిలిచిపోయాయని చెప్పారు. ఎన్నికలు ముగిసినందున పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన స్పష్టం చేశారు. మంజూరై ఇంకా చేపట్టని పనులను కూడా వెంటనే చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు కుర్మ హేమలత, టి.మహేశ్వరి, EE సుదర్శన్, ఎలెక్ట్రికల్ DE శ్రీధర్, AD కృష్ణ, వాటర్ వర్క్స్ CGM శశాంక్, AE సంధ్య, డివిజన్ BRS అద్యక్షులు వెంకటేషన్ రాజు, పద్మారావు నగర్ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, నాయకులు లక్ష్మీపతి, ప్రేమ్, అబ్బాస్, రజాక్, కుమార్ యాదవ్, ఫహీం బలరాం, సత్యనారాయణ, నర్సింగ్ రావ్, గోవర్ధన్, సాయి తదితరులు ఉన్నారు.









