వరద ముంపు సమస్యకు SNDP కార్యక్రమం ద్వారా శాశ్వత పరిష్కారం -సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్

ఎన్నో సంవత్సరాల వరద ముంపు సమస్యకు SNDP కార్యక్రమం ద్వారా శాశ్వత పరిష్కారం చూపామని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి బేగంపేట లోని బ్రాహ్మణ వాడి, వడ్డెర బస్తీలలో నాలా అభివృద్ధి పనులు, నూతనంగా చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. బస్తీలలో నూతనంగా నిర్మించిన CC రోడ్లతో వాటి రూపు రేఖలు మారిపోయాయి. తమ బస్తీలు ఇంత గొప్పగా అభివృద్ధి చెందుతాయని తాము కలలో కూడా ఊహించలేదని స్థానికులు MLA శ్రీనివాస్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు. బ్రాహ్మణ వాడి లోని లైన్ 4 లో పెండింగ్ లో ఉన్న డ్రైనేజీ పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వేసవి కాలం ప్రారంభం అవుతున్నందున నాలా లో మిగిలిన పూడిక తొలగింపు పనులు చేపట్టేందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వర్షాకాలంలో నాలా కు ఎగువ నుండి వచ్చే వరద కారణంగా పరిసర బస్తీలలోకి నీరు చేరి ఇండ్లు ముంపుకు గురయ్యేవని తెలిపారు. తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఎన్నో సంవత్సరాలుగా కోరుతూ వచ్చారు. తెలంగాణ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో SNDP కార్యక్రమం చేపట్టి నగరంలోని అనేక నాలాల అభివృద్ధి పనులను చేపట్టిందని వివరించారు. సుమారు 45 కోట్ల రూపాయల వ్యయంతో బేగంపేట నాలా అభివృద్ధి పనులతో పాటు పరిసర కాలనీలలో మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ, నాణ్యత కలిగిన CC రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఎన్నో సంవత్సరాల నుండి పడుతున్న వరద ముంపు సమస్య కష్టాలు ఇక తొలగిపోయినట్లేనని ఆయన చెప్పారు. ఆయన వెంట కార్పొరేటర్ టి.మహేశ్వరి, DC శంకరయ్య, EE సుదర్శన్, SNDP EE శ్రీధర్, వాటర్ వర్క్స్ GM వినోద్, DGM శశాంక్, డివిజన్ BRS అద్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, జనరల్ సెక్రెటరీ ఆరీఫ్, సీనియర్ నాయకులు టి.శ్రీహరి, నరేందర్ రావు, శేఖర్, కిషోర్, ఆకుల హరికృష్ణ తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *