పిల్లల్లో ఉన్న సుజనాత్మకతను వెలికి తీయడంతో పాటు వారిలో దేశభక్తిని, మత సామరస్యాన్ని పెంపొందించడమే ప్రకాశం బాలోత్సవ ముఖ్య ఉద్దేశ్యము – జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ

పిల్లల్లో ఉన్న సుజనాత్మకతను వెలికి తీయడంతో పాటు వారిలో దేశభక్తిని, మత సామరస్యాన్ని పెంపొందించడమే ప్రకాశం బాలోత్సవ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పేర్కొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

శుక్రవారం ఉదయం ఒంగోలు నగరంలోని పివిఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో రెండు రోజులు పాటు ఏర్పాటుచేసిన ప్రకాశం బాలోత్సవ ప్రధమ పిల్లల పండుగ కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వెంకాయమ్మ, జిల్లా కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్, నగర మేయర్ గంగాడ సుజాత, మాజీ శాసన మండలి సభ్యులు విటపు బాలసుబ్రమణ్యం లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆవిష్కరించగా, ప్రకాశం బాలోత్సవం జెండాను జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వెంకాయమ్మ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వెంకాయమ్మ మాట్లాడుతూ, పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు దేశభక్తిని, మత సామరస్యాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. నేటి విద్యా విధానంలో పిల్లలు ఎదుర్కొంటున్న ఒత్తిడిని అధిగమించేందుకు వారిలో మానసిక స్థైర్యంను పెంపొందించేందుకు బాలోత్సవ కార్యక్రమం ఒక సాధనంగా ఉండాలన్నారు. పిల్లలను ప్రోత్సహించే విధంగా జీవితంలో నైతిక విలువలు, దేశభక్తి పెంపొందేలా బాలోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలనే లక్ష్యంతో, ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించేందుకు జిల్లా పరిషత్ నిధుల నుండి 4.5 లక్షలు రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగిందని అన్నారు. దేశ భవిష్యత్తు పిల్లల చేతిలో ఉందని, వారిలో ఉన్న ప్రతిభను గుర్తించేందుకు ఇలాంటి వేడుకలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆమె అభిప్రాయపడ్డారు.

జిల్లా కలెక్టర్ ఏ.ఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా వివిధ జిల్లాల్లో చదువుచున్న పిల్లల్లో దాగివున్న నైపుణ్యాన్ని వెలికితీసి ప్రోత్సహించేలా ప్రకాశం బాలోత్సవ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్న బాలోత్సవ కమిటీ వారికి, సహకరించిన వారికి అభినందలు తెలుపుతూ, ఈ బాలోత్సవ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా సుమారు 4 వేల మంది విద్యార్థులు పాల్గొనడం సంతోషదాయకం అన్నారు. రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో 47 ఈవెంట్స్ నిర్వహించి ప్రతి ఈవెంట్లో గెలుపొందిన వారికి కామన్ వేదికలో బహుమతులు ప్రధాన చేయడం మంచి ఉద్దశ్యమన్నారు. ఈ కార్యక్రమం ఉద్దేశాన్ని ఉపాధ్యాయులు పిల్లలకు వివరిస్తూ, మరింత మంది పిల్లలు వచ్చే సంవత్సరం నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనేలా ప్రోత్సహించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఉపాధ్యాయులకు సూచించారు.

ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ, సుజనాత్మకతతో ఏ పని చేసినా ఆ వ్యక్తికి మంచి గుర్తింపు ఉంటుందని, నేడు చదువు ఒకటే కాదని చదువుతోపాటు వివిధ రంగాల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశ భవిష్యత్తు పిల్లల చేతిలో ఉందని, ఆ పిల్లలను ప్రోత్సహించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగా గ్రామీణ యువతలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఆడుదాం
ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించటం జరిగిందని అన్నారు. మన జిల్లా నుండి కూడా 120 మంది రాష్ట్రస్థాయి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి వెళ్లడం జరిగిందని ఆమె తెలిపారు. పిల్లల్లో నిగూఢమైన నైపుణ్యాన్ని గుర్తించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు పై ఉందన్నారు. పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని, సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు ఇలాంటి వేదికలు ఎంతగానో తోడ్పడుతాయన్నారు.

మాజీ శాసన మండలి సభ్యులు విఠపు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ, గత ఆరు సంవత్సరాల నుండి అమరావతి బాలోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతున్నదని, ఈరోజు ఒంగోలు నగరంలో ప్రకాశం బాలోత్సవ కార్యక్రమం నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. పిల్లలను ఈ వేదికల ద్వారా ప్రోత్సహిస్తే వారు అద్భుత ప్రపంచాన్ని చూపిస్తారని అన్నారు. నాలుగు గోడల మధ్య విద్యను బోధించేలా కాకుండా ఈ రెండు రోజులపాటు ఉపాధ్యాయులు పిల్లలతో కలిసిపోయి వారిలో నైపుణ్యాన్ని గుర్తించి, వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు ఇలాంటి వేదికలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయన ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించారు.

ప్రతిభ విద్యా సంస్థల అధినేత
ఎన్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ
ప్రతి వ్యక్తి తమ జీవితంలో ఆనందంగా ఉండాలంటే తోటి వారికి సహాయ సహకారాలు అందిస్తూ, మంచి ఆలోచనలతో సమాజంలో మంచి కార్యక్రమాలు చేపట్టినప్పుడే మనిషి సంతోషంగా ఉంటారని ఆయన అన్నారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాటిబండ్ల ఆనందరావు మాట్లాడుతూ, పెద్దల అండతో పిల్లల పండుగగా బాలోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 47 ఈవెంట్స్ లో 32 అకడమిక్ ఈవెంట్స్, 15 కల్చర్ ఈవెంట్స్ 5 వేదికల్లో నిర్వహించబడతాయన్నారు. విద్యార్థులు స్వేచ్ఛగా తమలో ఉన్న కళాత్మక నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఈ కార్యక్రమం వేదిక కావాలన్నారు.
కార్యక్రమంలో ఉప జిల్లా విద్యా శాఖాధికారి అనిత రాణి, పివీఆర్ స్కూలు హెచ్ఎం మువ్వ రాధిక, బాలోత్సవ కమిటీ సభ్యులు,వివిధ పాఠశాలల విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *