గుర్రం జాషువ గారిని స్ఫూర్తిగా తీసుకొని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇంఛార్జి మంత్రి మేరుగు నాగార్జున అన్నారు.
ప్రకాశం భవనం ప్రాంగణంలో గుర్రం జాషువ సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గుర్రం జాషువ కాంస్య విగ్రహాన్ని శుక్రవారం సాయంత్రం రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, జిల్లా కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్, గుర్రం జాషువ సాహిత్య సాంస్కృతిక సేవా సమితి అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య, కార్యదర్శి ఎండ్లూరి రవికుమార్ లతో కలసి ఆవిష్కరించారు.
అనంతరం నిర్వహించిన జాషువ సాహిత్య జయభేరి మహాసభలో మంత్రులు మేరుగు నాగార్జున, డా. ఆదిమూలపు సురేష్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి వెంకాయమ్మ, జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తదితరులు గుర్రం జాషువ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సంధర్భంగా సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన శ్రీరామ్ సాగర్, డా. ఎజ్రా శాస్త్రి, డా. నూకతోటి రవి కుమార్, డా. బద్దిపూడి జయారావ్, సింహాద్రి జ్యోతిర్మయి లను ఘనంగా సన్మానించుకోవడం జరిగింది.
ఈ సందర్బంగా మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ, గుర్రం జాషువ లాంటి మహనీయుని యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో బాగస్వాములను చేయడం పట్ల జిల్లా యంత్రాంగానికి, గుర్రం జాషువ సాహిత్య సేవ సమితి వారికి తన కృతజ్ఞతలు తెలియచేస్తూ, కవి సామ్రాట్ గా చరిత్రలో నిలిచిపోయిన గుర్రం జాషువ రచించిన గబ్బిలం గాని, పిరదౌసి రచనలు చిరస్థాయిగా అందరి మనస్సుల్లో ఇప్పటికీ నిలిచిపోయాయన్నారు. గుర్రం జాషువ వారి ఆలోచనలు, భావాలను ప్రజలందరికీ తెలిసేలా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగు చున్నదన్నారు. భారత దేశం గర్వించేలా దేశంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల డా. బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేయడం జరిగిందని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు.
ఈ సందర్బంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, గుర్రం జాషువ లాంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క విగ్రహాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పండుగ వాతావరణంలో ఈ రోజు గుర్రం జాషువ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఎంతో ఆనందంగా వుందని, గుర్రం జాషువ గారి ఆలోచనా విధానాలను, భావ జాలాన్ని ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గుర్రం జాషువకి సముచిత స్థానం కల్పిస్తూ అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుచున్నదన్నారు. గుంటూరు నగరంలో 2 కోట్ల రూపాయలతో గుర్రం జాషువ స్మృతి వనాన్ని నిర్మించుకొనేలా పనులు ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. నెల్లూరులో కూడా 50 లక్షల రూపాయలతో గుర్రం జాషువ గ్రంధాలయాన్ని ఆధినీకరించేలా చర్యలు తీసుకోవడం జరుగు చున్నదన్నారు. గుర్రం జాషువ స్పూర్తి తో రాష్ట్ర ప్రభుత్వం సామాజిక సాధికారత, సామాజిక న్యాయం కోసం కృషి చేస్తున్నట్లు మంత్రి సురేష్ తెలిపారు.
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వెంకాయమ్మ మాట్లాడుతూ, గుర్రం జాషువ ఆధునిక కవుల్లో ప్రధమ స్థానం పొందిన మహవ్యక్తి అని అన్నారు. నేటి కూడా సంఘసంస్కర్తలకు ఆదర్శ పురుషుడు గుర్రం జాషువ అని, వారి విగ్రహ ఆవిష్కరణకు జిల్లా పరిషత్ నిధుల నుండి 5 లక్షల రూపాయల నిధులను కేటాయించడం జరిగిందన్నారు.
జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ, సామాజిక న్యాయం కోసం, సమానత్వం కోసం తన రచనల ద్వారా అహర్నిశలు కృషి చేసిన మహనీయులు గుర్రం జాషువ యొక్క విగ్రహాన్ని కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా వుందన్నారు. గుర్రం జాషువ రచనలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ సమాజ అభ్యున్నతికి పాటుపడాలన్నారు.
కార్యక్రమంలో ఎపి స్టేట్ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కె. కనకారావు, లిడ్ క్యాప్ చైర్మన్ కె. రాజశేఖర్, పాటిబండ్ల ఆనంద రావు, గుర్రం జాషువ మనువరాలు యామినీ, గుర్రం జాషువ సాహిత్య సాంస్కృతిక సేవా సమితి సభ్యులు, గుర్రం జాషువ విగ్రహ ప్రతిష్ట కమిటీ సభ్యులు, ప్రజలు, వివిధ దళిత సంఘాల నాయకులు, ప్రతినిదులు, డివిఎంసి సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




